ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ్రపాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం థెల్మా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మనకు వయస్సు మీద పడే కొద్దీ మనస్సు కూడా నీరసించిపోతుందనుకుంటాం. వయస్సు ఎంతైనా సంకల్ప బలం బాగా ఉంటే మనమేదైనా సాధించవచ్చు అని నిరూపించిన సినిమా ‘థెల్మా’. అలా అని ఇదేదో ఫ్యాంటసీ మ్యాజిక్ సినిమా అనుకుంటే పొరబడినట్లే. ఓ సాధారణ ముసలావిడ తన నుండి దోచుకున్న డబ్బు కోసం ఎటువంటి సాహసం చేసింది అనేదే ఈ సినిమా. జోష్ మార్గోలిన్ ఈ సినిమా దర్శకుడు. జూన్ స్క్విబ్ ‘థెల్మా’ సినిమాలోని ప్రధాన పాత్రలో నటించారు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆమె నటించిన పాత్ర వయస్సు 93... కానీ మనస్సు 23. ఇక జూన్ స్క్విబ్ నిజమైన వయస్సు 95... ఆమె ఈ సినిమాలో ఎంతో హుందాగా, సరదాగా నటించారు. ఈ సినిమా చూసిన తరువాత మన పెద్దవారు చాలా వరకు స్ఫూర్తి పొందే అవకాశం ఉంది. అంతలా ఏముందీ సినిమాలో... ఓ సారి లుక్కేద్దాం. కథా పరంగా 93 ఏళ్ల థెల్మా పోస్ట్ లాస్ ఏంజెల్స్ నగరంలో ఓంటరిగా నివసిస్తుంటుంది. అప్పుడప్పుడూ తన మనవడైన డెన్నీ చూడడానికి వస్తుంటాడు. ఓ రోజు థెల్మాకు ఓ అనామకుడు డెన్నీ గొంతుతో ఫోన్ చేస్తాడు. తాను ఓ యాక్సిడెంట్ చేశానని, తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతున్నారని, తాను దీని నుండి బయటపడాలి అంటే అర్జెంటుగా పదివేల డాలర్లు పంపాలని చెప్తాడు
పాపం థెల్మా ఇది మోసమని తెలియక ఆ అగంతకుడు చెప్పినట్టే డబ్బు పంపుతుంది. తరువాత తన తప్పు తెలుసుకుని చాలా బాధ పడుతుంది. కుటుంబ సభ్యులందరూ విషయం తెలుసుకుని ఇక చేసేదేమీ లేక థెల్మాని ఓదారుస్తారు. కానీ థెల్మా మాత్రం తన స్నేహితుడు బెన్‌తో కలిసి ఆ పోయిన డబ్బు కోసం పెద్ద సాహసమే చేస్తుంది. మరి... ఆ సాహసం ఏమిటి? ఆ సందర్భంలో థెల్మా ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నది మాత్రం జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న ‘థెల్మా’ సినిమాలో చూడాల్సిందే.
ఈ సినిమా చాలా వినూత్నంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను మీ పిల్లలతో పాటు పెద్దవాళ్లకు చూపించడం మరచిపోకండి. ఎందుకంటే సినిమా చూసిన తరువాత ‘థెల్మా’ స్ఫూర్తితో మీ పెద్దవాళ్లందరూ మరింత ఉత్సాహంగా ఉంటారు. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment