టైటిల్: కథ వెనుక కథ
నటీనటులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ, సునీల్, జయ ప్రకాష్, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు
స్టోరి, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య
బ్యానర్: దండమూడి బాక్సాఫీస్
నిర్మాత: అవనీంద్ర కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి గొట్టిపాటి
సినిమాటోగ్రాఫర్స్: గంగనమోని శేఖర్, ఈశ్వర్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
ఫైట్స్: అంజి, రియల్ సతీష్
విడుదలః మే 12వ తేదీ 2023
ఈ మధ్యకాలంలో సస్పెన్స్ -థ్రిల్లర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. అందులో భాగంగానే దండమూడి బాక్సాఫీస్ సంస్థ కృష్ణ చైతన్య అనే యంగ్ డైరక్టర్‌తో `కథ వెనుక కథ` సినిమా నిర్మించింది. టైటిల్ దగ్గర నుంచి పాటలు, టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ మే 12న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకుందాం...
కథలోకి వెళితే...
ఎప్పటికైనా కావాలన్నది అశ్విన్ (కథానాయకుడు విశ్వంత్) కల. ఈ క్రమంలో తన మేనమామ కూతురు శైలజతో ప్రేమలో పడతాడు. ఓ మంచి సినిమా తీసి హిట్ కొడితేనే తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని కండీషన్ పెడతాడు మేనమామ. ఎంతో మంది నిర్మాతలకు స్టోరీలు చెబుతాడు, కానీ ఎవరూ ముందుకు రారు. చివరికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తనతో సినిమా తీయడానికి ముందుకొస్తాడు.
సినిమా షూటింగ్ పూర్తయి.. రిలీజ్ దగ్గర పడే సమయంలో ప్రమోషన్స్‌కు డబ్బులు అడ్జస్ట్ అవ్వడం లేదని నిర్మాత షాక్ ఇస్తాడు. దీంతో అశ్విన్ డిప్రెషన్‌కి లోనవుతాడు. ఇంతలో అశ్విన్ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు కనపడకుండా పోతారు. మిస్సైన ఐదుగురిలో రాజు చనిపోతాడు. రాజు ఎలా చనిపోయాడు? అసలు అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న `తెర వెనుక కథ` నటీనటులు ఎలా మిస్సయ్యారు? సత్య ( సునీల్) అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈ కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? సత్య స్టోరి ఏంటి? అప్పటికే వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. దానికీ, దీనికీ ఏమైనా సంబంధాలున్నాయా అనేది మిగతా స్టోరి.
విశ్లేషణలోకి వెళితే...
`కథ వెనుక కథ` అనే టైటిల్ లోనే మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయని అర్థమవుతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ అశ్విన్, ప్రొడ్యూసర్ జయ ప్రకాష్ , పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సత్య... వీరి ముగ్గురి జీవితాలకు సంబంధించిన కథ ఇది. ఎలాగైనా మంచి సినిమా తీసి హిట్ కొట్టాలన్న కసి హీరోది. సినిమా నిర్మించాలన్న తన కూతురి కలను నెరవేర్చాలన్నది నిర్మాత పట్టుదల, తప్పు జరిగితే ఎంత దూరమైనా వెళ్లే పోలీస్ ఆఫీసర్ సత్య. కానీ వీరి జీవితాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి వారి కలలను, ఆశయాలను దెబ్బతీస్తాయి. ఆ పరిణామాలు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఒక దారుణమైన హత్యతో సినిమా ఓపెన్ చేసి దర్శకుడు ఆడియన్స్‌కు లాక్ వేశాడు. ఆ తర్వాత హీరో విశ్వంత్ లవ్ స్టోరీతో పాటు తను డైరక్షన్ ఛాన్సుల కోసం వెతకడం, నిర్మాతలను కలవడం...సినిమా ఓకే కావడం...ఆ సినిమాలో వరుస హత్యలకు పాల్పడుతున్న గ్యాంగ్ నటించడం ఇలా ఫస్టాప్ అంతా బాగా డిజైన్ చేశాడు దర్శకుడు. ఆ తర్వాత అర్థాంతరంగా సినిమా ఆగిపోవడం, డైరెక్టర్ సినిమాకు బజ్ తీసుకురావాలని ప్లాన్ చేయడం, మీడియాలో ఈ సినిమా సంచలనంగా మారడం, ఈ క్రమంలో హీరో అసలు ఏం జరుగుతుందోనని తెలుసుకొని ఈ వరుస హత్యలకు కారకులు ఎవరో ఛేదించడం... ఇలా కథ అనేక మలుపులతో, ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తుంది. ఫస్టాఫ్ అంతా కొంత స్లో గా సాగినా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సునీల్ కి సంబంధించిన సీక్వెన్స్ కూడా కొంత ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది.
ఎవరెలా నటించారంటే...
డైరక్టర్‌గా అశ్విన్ నటన ఓకే అనిపిస్తుంది. సునీల్ క్యారెక్టర్ మాత్రం సినిమాకు సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నిర్మాతగా చేసిన జయప్రకాష్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రఘుబాబు, మధునందన్ , సత్యం రాజేష్, భూపాల్ , ఖయ్యుం పాత్రలకు తగ్గట్టుగా నటించారు. హీరోయిన్ కి పెద్ద స్కోప్ లేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు...
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా దర్శకుడు రాసుకున్న కథ, కథనాలు గురించి చెప్పాలి. మల్టిపుల్ లేయర్స్ ఉన్న కథని తెరకెక్కించడం ఆషామాషీ విషయం కాదు. కానీ కృష్ణ చైతన్య సినిమాను ఆసక్తికరంగా మలచడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సెకండాఫ్ లో ఒక్కో ట్విస్ట్ ని రివీల్ చేస్తూ ఆడియన్స్‌ను థ్రిల్ కి గురి చేసిన విధానం బాగుంది. నటీనటులు, టెక్నీషియన్స్ దగ్గర నుంచి మంచి వర్క్ రాబట్టుకున్నాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హెల్పయ్యాయి. నిర్మాతలు కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment