
తమిళసినిమా: ఇప్పుడు చిన్న చిత్రం, పెద్ద చిత్రం అనే తారతమ్యాలు చెరిగిపోతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఆదరించిన సినీ ప్రియులు గత శుక్రవారం తెరపైకి వచ్చిన లోబడ్జెట్ చిత్రం లవ్ టుడేనూ ఆదరిస్తున్నారు. ఇక్కడ ఈ విజయాలకు కారణం కథ, కథనాలే. ఇంతకుముందు జయం రవి కథానాయకుడిగా కోమాలి అనే సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం లవ్ టుడే.
విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఈయనే కథానాయకుడు కావడం. సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవేనా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
ప్రేమ, వినోదం ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై కోల్పోతాయి ఎస్.అఘోరం నిర్మించారు. ఈతరం ఆతరం అన్న బేధం లేకుండా చిత్రాన్ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. విమర్శకులు, సినీ ప్రముఖుల ప్రశంసలను చూరగొంటున్న ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే తమిళనాడులో మాత్రమే రూ.15 కోట్లు వసూలు చేసి పెద్ద విజయం వైపు దూసుకుపోతోంది. స్టార్ దర్శకులు, హీరోలకు దక్కని ఈ విజయం మంచి కంటెంట్‌తో రూపొందిన లవ్ టుడేకు దక్కడాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment