Madam Chief Minister Movie Review, Rating In Telugu: Richa Chadha Powers This Unpredictable, Entertaining Political Drama - Sakshi
Sakshi News home page

'మేడం చీఫ్‌ మినిస్టర్' మూవీ రివ్యూ

Published Tue, Apr 6 2021 12:04 AM | Last Updated on Tue, Apr 6 2021 9:08 AM

Madam Chief Minister Movie Review - Sakshi

‌‘ఎలా కనిపిస్తున్నాను? ఏక్‌దమ్‌ పటాఖా కదూ? ఎలా ఉన్నా నేను మీ ఇంటి అమ్మాయిని!’ అంటుంది తారా వేల మంది హాజరైన ఒక బహిరంగ సభలో. ఆ సాహసం వెనక చాలా పోరాటమే ఉంటుంది.. లింగ, కుల వివక్షను జయించి.. తన ఉనికిని చాటుకునే పోరాటం! ఆ కథే ‘మేడం చీఫ్‌ మినిస్టర్‌’. ఇందులోని ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు, ఒక దళిత మహిళ ముఖ్యమంత్రి కావడం వంటివి కొంత మాయావతి రాజకీయ జీవితాన్ని గుర్తుకు తెస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుభాష్‌ కపూర్‌. ఫస్‌గయేరే ఒబామా, జానీ ఎల్‌ఎల్‌బీ చిత్రాలు తీసిందీ అతనే. 

సినిమా ఎక్కడ మొదలవుతుందంటే.. 
1980లు.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతం.. ఒక దళిత యువకుడి పెళ్లి ఊరేగింపు ఉన్నత కులస్తులు ఉండే వీధిగుండా వెళుతూ ఉంటుంది. ఉన్నత కులస్తుల వీధిలోకి అంత ఆర్భాటంగా దళితుల పెళ్లి ఊరేగింపు వెళ్లడం అగ్రవర్ణాల వాళ్ల అహాన్ని దెబ్బతీస్తే, ఆ ఊరేగింపు వల్ల నిద్రాభంగం కలగడం ఇంకో తప్పుగా వాళ్లకు తోచి వాదనకు దిగుతారు. రెండు వర్గాల మధ్య ఆ వివాదం పెద్దదై కాల్పులకు దారితీస్తుంది. దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ క్షణానే ఆ మరణించిన వ్యక్తి భార్య ఆడపిల్లను కంటుంది. అయిదో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో అత్తగారు ఆ పిల్లను పురిట్లోనే చంపే ప్రయత్నం చేయబోతుంది. ఈలోపే కొడుకు శవమై ఇంటికి చేరేసరికి దానిక్కారణమూ పసిబిడ్డనే చేసి పుట్టిన క్షణమే తండ్రిని మింగిన ఆ పిశాచి బతకడానికి ఏ మాత్రం వీల్లేదని తీర్మానిస్తుంది. కాని తల్లి అక్కడి నుంచి పారిపోయి బిడ్డను కాపాడుకుంటుంది. ఆమెని పెంచి పెద్ద చేస్తుంది. ఆ అమ్మాయే తార (రీచా ఛద్దా).. మేడం చీఫ్‌ మినిస్టర్‌.

ఆ ప్రయాణానికి ముందు.. 
బాయ్స్‌ కాలేజ్‌లో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటుంది తార. అగ్రవర్ణానికి చెందిన వాడు, ఆ కాలేజి విద్యార్థి నాయకుడు.. ఇంద్రమణి త్రిపాఠీ (అక్షయ్‌ ఒబేరాయ్‌) తో ప్రేమలో పడుతుంది. అతని వల్ల ప్రెగ్నెంట్‌ అవుతుంది. అంతకుముందులాగే అబార్షన్‌ చేయించుకోమంటాడు ఇంద్రమణి. ‘కుదరదు.. పెళ్లి చేసేసుకుందాం’ అంటుంది తార. కంగుతింటాడు ఇంద్రమణి. అది మాటల్లో వినిపించనివ్వకుండా రాజకీయ నేతగా ఎదగాలనే తన లక్ష్యం గురించి చెప్తాడు. పెళ్లి చేసుకుని కూడా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు కదా అని సముదాయిస్తుంది తార. అప్పుడు మనసులోని మాట బయటపెడ్తాడు ఇంద్రమణి.. ఆమె కులాన్ని గుర్తు చేస్తూ. ఈసారి తార విస్తుపోతుంది. ‘నేను అంటే నీకంత ఇష్టమైతే జీవితాంతం నీ బాగోగులు చూస్తాను కాని పెళ్లి, పిల్లలు అనే ఆశను వదిలేసుకో’ అని హెచ్చరిస్తాడు. తార ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇంద్రమణి ఇంటికి వెళ్లి.. తన గర్భవతినని చెప్తుంది ఇంద్రమణి తండ్రితో.

ఆమె వెళ్లిపోయాక కొడుకుకి చెప్తాడు.. ‘రాజకీయంగా ఎదగాలంటే ఇలాంటి అవాంతరాలను తొలగించుకోవాలి’ అని. ఆ రాత్రే తన అనుచరులను తార మీద దాడికి పంపిస్తాడు ఇంద్రమణి. దళితులకు రాజకీయాధికారం రావాలని పార్టీ పెట్టి.. తపన పడుతున్న నేత సూరజ్‌భాన్‌ (సౌరభ్‌ శుక్లా) ఆమెను రక్షిస్తాడు. అతని గురించి తెలుసుకున్న తార.. అతని అనుచరిగా మారుతుంది. దళితుల్లో చైతన్యం కలిగించేందుకు పల్లెపల్లెకు వెళ్తున్న సూరజ్‌ను మోటార్‌ సైకిల్‌ మీద డ్రైవ్‌ చేస్తుంది. ఆ పాఠాలను తనూ గ్రహిస్తూ రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటుంది. ఈలోపే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు వస్తాయి. సూరజ్‌ భాన్‌ పార్టీ ప్రభావం తెలుసున్న ప్రత్యర్థి పార్టీ నేత అరవింద్‌ సింగ్‌ (శుభ్రజ్యోతి భరత్‌) .. ఆ దళిత నేతతో పొత్తు పెట్టుకుంటాడు. అయితే ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి తమ పార్టీ అభ్యర్థికే ఇవ్వాలని సూరజ్‌ భాన్‌ షరతు పెడ్తాడు. ఆ రాజకీయ వ్యవహారం, రాయబారాన్ని తారే నిర్వహిస్తుంది.

ఆమె సామర్థ్యం అర్థమైన సూరజ్‌ భాను సిట్టింగ్‌ ముఖ్యమంత్రికి ప్రత్యర్థిగా, తమ పార్టీ అభ్యర్థిగా తారను నిలబెడ్తాడు. పైన చెప్పుకున్న నినాదం ‘ఎలా కనిపిస్తున్నాను.. ఏక్‌దమ్‌ పటాఖా లాగా కదూ’ అంటూ ప్రజలను ఆకట్టుకుంటుంది.. వాళ్ల మనిషనే భావనను కల్పిస్తుంది. బంపర్‌ మెజారిటీతో గెలుస్తుంది. తనకు ముఖ్యమంత్రి పదవి ఇమ్మని అడుగుతుంది తన రాజకీయ గురువు సూరజ్‌ భానును. పొత్తు పెట్టుకున్న పార్టీ వాళ్లే కాదు సొంత పార్టీ అభ్యర్థులూ తారను వ్యతిరేకించినా, సూరజ్‌భాను తారనే ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తాడు. అప్పుడు వస్తాడు తార రాజకీయ జీవితంలోకి ఇంద్రమణి.. అరవింద్‌ సింగ్‌ సిఫారసు ద్వారా. తారను ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటాం.. అయితే ఇంద్రమణికి మంత్రి పదవి ఇవ్వాలని సూరజ్‌ భానుతో తారకు చెప్పిస్తాడు. తార ఒప్పుకోదు. తన ఆఫీస్‌ కు వచ్చిన ఇంద్రమణిని అవమానించి పంపిస్తుంది. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాల్లో తారకు అండగా ఉంటాడు ఓఎస్‌డీగా నియమితుడైన డానిష్‌ ఖాన్‌ (మానవ్‌ కౌల్‌).

వెన్నుపోటు
మహిళ, అందునా దళిత మహిళను ముఖ్యమంత్రిగా జీర్ణించుకోలేకపోతారు ప్రత్యర్థి పార్టీ నేతలే కాదు సొంత పార్టీ నేతలు కూడా. ఇంకా చెప్పాలంటే సూరజ్‌ భానుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి కూడా. అతణ్ణి పావుగా వాడుకొని సూరజ్‌ను చంపిస్తాడు ఇంద్రమణి. సూరజ్‌ చనిపోయాక ఆ పార్టీకి మద్దతు విరమించుకుంటాడు అరవింద్‌. మూడురోజుల్లో బలపరీక్ష ఉందనగా డానిష్‌ రెహమాన్‌ సలహా మేరకు అరవింద్‌ సింగ్‌ పార్టీ, తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ కిడ్నాప్‌ చేసి ఓ హోటల్‌లో పెడ్తుంది తార. హోటల్‌ మీద రైడ్‌ చేసి బందీలను తీసుకెళ్లిపోవాలని వస్తారు అరవింద్‌ సింగ్, ఇంద్రమణి. పోలీసులు రంగ ప్రవేశం చేసి కాల్పులు జరుపుతారు. అరవింద్‌ సింగ్, ఇంద్రమణి తప్పించుకుని వెళ్లిపోతుండగా హోటల్‌ పై అంతస్తు బయట పైప్‌లైన్‌ను ఆనుకొని గోడ మీద నిలబడి ఉన్న తార, డానిష్‌ ఖాన్‌లు కనపడ్తారు.

తారకు తుపాకి గురిపెడ్తాడు ఇంద్రమణి. ఆమెను రక్షించే ప్రయత్నంలో జారి కిందపడ్తాడు డానిష్‌. భయపడి పారిపోతారు అరవింద్, ఇంద్రమణి. కాచుకుని ఉన్న తార మనుషులు ఇంద్రమణిని కాల్చి చంపుతారు. తర్వాత జరిగిన బలపరీక్షలో తార నెగ్గుతుంది. డానిష్‌ కూడా ప్రమాదం నుంచి కోలుకొని ఆరోగ్యవంతుడవుతాడు. అన్నిట్లో తనకు అండదండగా ఉండడమే కాక తన ప్రాణాలకు అతని ప్రాణాలను అడ్డుపెట్టిన డానిష్‌ను పెళ్లి చేసుకుంటుంది తార. పాలనాపరంగా కూడా దూసుకెళుతూంటుంది. దళితులకు ఆలయ ప్రవేశం, వాళ్లకు మెరుగైన ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ పెట్టి సామాన్యుల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటుంది తార. ప్రత్యర్థులకిది కంటగింపుగా ఉంటుంది. ఆమెను ఎలాగైనా పదవీచ్యుతురాలి గా చేయాలని చూస్తుంటారు. డానిష్‌ను ఎరగా వాడుకోవాలని చూస్తారు. డానిష్‌ లొంగడు. అయితే అతని ప్లాన్లు అతను వేస్తూంటాడు.  తారకు స్లో పాయిజన్‌ ఇప్పిస్తూంటాడు ఆహారం ద్వారా. ఆరోగ్యం దెబ్బతినడంతో తెలిసిన డాక్టర్‌ తో పరీక్ష చేయించుకుంటుంది.

ఆహారంలో విషం కలుస్తోందని అర్థమవుతుంది. ఆ విషం ద్వారా తారను అచేతనం చేసి.. తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు డానిష్‌. ఈ నిజాన్ని తెలుసుకున్న తార అది భరించలేకపోతుంది. అదే స్లో పాయిజన్‌తో డానిష్‌ను చక్రాల కుర్చీకి అంకితం చేయిస్తుంది. ప్రతర్థి పార్టీ తన భర్తను చంపించే కుట్ర పన్నారని చక్రాల కుర్చీలో సగం తెలివితో కూలబడిపోయిన భర్తను చూపించి తర్వాత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తుంది. ఆ సానుభూతితో ఓట్లను కొల్లగొట్టి సంపూర్ణ మెజారిటీతో సీఎం అవుతుంది తార. స్త్రీలు, దళితులు, దళిత స్త్రీల పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒకేసారి చాలా సమస్యల్ని చర్చించాలనే తాపత్రయంలో దేనిమీదా సరైన ఫోకస్‌ లేకుండా పోయింది. ‘‘ఇక్కడ మెట్రో లు కట్టే అభ్యర్థులు ఓడిపోతారు.. మందిర్లు కట్టే అభ్యర్థులు గెలుస్తారు’’ వంటి డైలాగులు ఆలోచింప చేస్తాయి. 
–ఎస్సార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement