మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయకండి: మోహన్‌లాల్‌ | Mohanlal begs public not to destroy Malayalam film industry | Sakshi
Sakshi News home page

మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయకండి: మోహన్‌లాల్‌

Published Sun, Sep 1 2024 1:16 AM | Last Updated on Sun, Sep 1 2024 1:20 AM

Mohanlal begs public not to destroy Malayalam film industry

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి హేమా  కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ‘అమ్మ’ (అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌) అధ్యక్షుడు మోహన్‌లాల్, ‘అమ్మ’ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ వివాదంపై మోహన్‌లాల్‌ మాట్లాడలేదు. హేమా కమిటీ నివేదిక, ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్‌లాల్‌ ఈ విధంగా మాట్లాడారు. 

ఏ పవర్‌ గ్రూప్‌లోనూ లేను: హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. నేను కూడా కమిటీ ముందు హాజరై,  నాకు తెలిసిన అన్ని విషయాలను పంచుకున్నాను. వాటిని ఇక్కడ చర్చించలేను. అలాగే కమిటీ నివేదికలో పేర్కొన్న ఏ పవర్‌ గ్రూప్‌లోనూ నేను లేను. అయినా నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటికీ ‘అమ్మ’నే కారణం అంటూ మాట్లాడటం కరెక్ట్‌ కాదు. మలయాళ పరిశ్రమ అంతా కలిసి స్పందించాల్సి ఉంది (ఇండస్ట్రీలో ఉండే పలు విభాగాల దర్శక–నిర్మాతలు, నటీనటులు వంటి సంఘాలు). నిజంగా తప్పులు చేసిన వారిని కోర్టు శిక్షిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు నివేదిక అంశాల పైనే పని చేస్తున్నారు.

అందుకే కేరళ నుంచి బయటకు వెళ్లాను: సమాజంలో సినిమా అన్నది ఓ భాగమే. హేమా కమిటీ నివేదిక ప్రస్తావనల పైనే దృష్టి సారిస్తూ మలయాళ పరిశ్రమను నాశనం చేయకండి. మద్రాసులో ఉండి నేను సినిమాలు చేసే సమయంలో సరైన సౌకర్యాలు కూడా లేవు. చిన్న పరిశ్రమగా మొదలైన మలయాళ ఇండస్ట్రీ ఎదుగుతోంది. ఇతర భాషల్లో మలయాళ చిత్ర పరిశ్రమ కళకు గుర్తింపు లభిస్తోంది. దక్షిణాది సినిమాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది.

ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ నాశనం కాకూడదు. చాలామంది ఉపాధి కోల్పోతారు. కొందరు ‘అమ్మ’ ఇలా చేయకూడదు.. అలా చేయకూడదు అంటున్నారు. ‘అమ్మ’ కోసం జరిగే ఎన్నికల్లో సభ్యులెవరైనా పోటీ చేయొచ్చు. ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాకు కావాలని దూరంగా ఉన్నానన్న వార్తలు అవాస్తవం. నా భార్య సర్జరీ, నేను హీరోగా చేసిన సినిమాకు చెందిన పనుల్లో బిజీగా ఉండి కేరళ నుంచి బయటకు వెళ్లాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement