‘గుంటూరు కారం’లో అది మిస్‌ అయింది.. ఈ టైటిల్‌ పెడితే బాగుండేది: పరుచూరి | Paruchuri Gopala Krishna Review On Guntur Kaaram Movie | Sakshi
Sakshi News home page

‘గుంటూరు కారం’ మహేశ్‌ స్థాయి సినిమా కాదు.. ఆ టైటిలే తప్పు: పరుచూరి

Published Sat, Feb 17 2024 12:02 PM | Last Updated on Sat, Feb 17 2024 12:46 PM

Paruchuri Gopala Krishna Review On Guntur Kaaram Movie - Sakshi

మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది మహేశ్‌ బాబు రేంజ్‌ సినిమా కాదని, త్రివిక్రమ్‌ బలమైన కథను రాసుకోలేకపాయడనే విమర్శలు కూడా వచ్చాయి. కలెక్షన్స్‌ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెటిఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న గుంటూరు కారం చిత్రంపై యూట్యూబ్‌ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. ఇది మహేశ్‌ బాబు స్థాయి సినిమా కాదని, టైటిల్‌ కూడా అలా పెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. 

‘350 చిత్రాలకు పైగా పని చేసిన నాకు ‘గుంటూరు కారం’ కథనం కాస్త కన్‌ఫ్యూజ్‌గా అనిపించింది.ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. రెండోసారి చూస్తే స్పష్టత ఉండొచ్చేమో. దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నాడు. గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్‌ చేశారు. త్రివిక్రమ్‌ మంచి టైటిల్స్‌ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే.. సంబంధిత డాక్యుమెంట్స్‌పై హీరో సంతకం పెడతాడా, లేదా? అనే పాయింట్‌ చుట్టు ఈ కథ అల్లుకున్నాడు. అయితే ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్‌ పండలేదు. అలాగే తాత మనవళ్ల సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌ కాలేదు.  హీరో అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్‌ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు.

సెంటిమెంట్‌ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. ‘గుంటూరు వారి అబ్బాయి’ అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం.. పేరుకు సరిపోయేలా స్క్రీన్‌ప్లేని సెట్‌ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్‌.. హీరో ఇంటికొచ్చి, ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్‌ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్‌ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. అని పరుచూరి అభిప్రాయ పడ్డాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement