Pizza 3 The Mummy 2023 Movie Review And Rating In Telugu | Kavitha Bharathi | Raveena Daha - Sakshi
Sakshi News home page

Pizza 3 Telugu Movie Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ

Published Fri, Aug 18 2023 12:41 PM | Last Updated on Fri, Aug 18 2023 1:41 PM

Pizza 3 Movie Review And Rating Telugu - Sakshi

టైటిల్: పిజ్జా-3 ద మమ్మీ
నటీనటులు: అశ్విన్ కాకుమాను, పవిత్రా మారిముత్తు, అభి నక్షత్ర, కాళీ వెంకట్ తదితరులు
నిర్మాణ సంస్థ:  తిరుకుమరన్ ఎంటర్ టైన్‌మెంట్స్
నిర్మాత: సీవీ కుమార్
దర్శకుడు:‍ మోహన్ గోవింద్
సంగీతం: అరుణ్ రాజ్
ఎడిటర్‌: అశ్విన్
సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్
విడుదల తేది: 2023 ఆగస్టు 18

'పిజ్జా 3' కథేంటి?
నలన్(అశ్విన్ కాకుమాను) ఓ రెస్టారెంట్‌కి యజమాని. కాయల్(పవిత్రా మారిముత్తు) అనే యాప్ డెవలపర్‌తో ప్రేమలో ఉంటాడు. తమ పెళ్లి గురించి మాట్లాడాదమని ఆమె అన్నయ్యని కలిస‍్తే నలన్‌ని అవమానిస్తాడు. నలన్ రెస్టారెంట్‌లో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. అతడికి తెలిసిన కొందరు వ్యక్తులు వరసగా అనుమానాస్పద రీతిలో చనిపోతుంటారు. అయితే ఈ మరణాలకు ఓ దెయ్యంతో సంబంధం ఉంటుంది. మరి ఆ ఆత్మ ఇంతమందిని చంపడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే 'పిజ్జా 3' స్టోరీ.

(ఇదీ చదవండి: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’మూవీ రివ్యూ)

ఎలా ఉందంటే?
2012లో ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజైన 'పిజ్జా' సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాతో నటుడిగా విజయ్ సేతుపతి, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏడాదే(2013) 'పిజ్జా 2' వచ్చింది. కానీ ఫస్ట్ పార్ట్‌లా సక్సెస్ కాలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో పార్ట్ 'పిజ్జా 3- ద మమ్మీ'. అయితే ఎలాంటి ప్రమోషన్స్‌ లేకుండా తెలుగులో తాజాగా ఈ మూవీ రిలీజైంది.

ఫస్టాప్ విషయానికొస్తే.. చిన్న సైజ్ ఈజిప్ట్ మమ్మీ బొమ్మ చూపించే సీన్‌తో సినిమాని మొదలుపెట్టారు. ఓ ఫ్యామిలీలోని తండ్రి దగ్గరున్న ఆ బొమ్మ.. అనుకోకుండా రెస్టారెంట్ నడుపుతున్న నలన్ దగ్గరకు చేరుకోవడం, పనివాళ్లు దాన్ని తీసి ఓ చోట పెట్టడం, దీంతో రాత్రుళ్లు ఆ రెస్టారెంట్‌లో వింత వింత శబ్దాలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మధ్యమధ్యలో హారర్ సీన్స్ వస్తుంటాయి. మరోవైపు నలన్‌కి తెలిసిన వ్యక్తులు చనిపోవడం లాంటి సీన్స్‌తో నడిపించారు.

ఇంటర్వెల్ టైంకి దెయ్యాన్ని చూపించి కాస్త ఆసక్తి క్రియేట్ చేశారు. సెకండాఫ్‌లో అసలు ఆ దెయ్యం ఎందుకు హత్యలు చేస్తోంది? ఈ మొత్తం వ్యవహారంతో హీరో నలన్‌కి లింక్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంటర్వెల్ వరకు పెద్దగా రివీల్ చేయకుండా స్టోరీని సాగదీసిన దర్శకుడు.. సెకండాఫ్ కోసం మొత్తం కంటెంట్‌ని దాచిపెట్టుకున్నాడు. పోనీ అది కొత్తగా ఏమైనా ఉందంటే లేదు. ఇప్పటికే చాలా హారర్ సినిమాల్లో వాడేసిన స్టోరీ లైన్‌తోనే సినిమా తీశారు. అక్కడక్కడా భయపెట్టినా, పెద్దగా ఎంటర్ టైన్ చేయలేకపోయారు.

సినీ ప్రేమికులు ఇప్పటికే వందల కొద్దీ హారర్ సినిమాలు చూసి రాటుదేలిపోయారు. ఇలాంటి వాళ్లని భయపెట్టాలంటే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. అలా కాదు రెగ్యులర్ రొటీన్ స్టైల్‌లో తీస్తాం అంటే కుదరరు. ఈ మూవీ విషయంలో రొటీన్ ఫార్మాట్‌నే డైరెక్టర్ ఫాలో అయిపోయాడు. క్రికెట్ బంతి తగలడం వల్ల అమ్మాయి మెమొరీ లాస్, 250 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనిషి చనిపోయినా సరే అతడి శరీరంలో పెద్దగా మార్పులు రాకపోవడం లాంటి సీన్స్‪‌లో ఎందుకో లాజిక్ మిస్ అయ్యారని అనిపించింది. 'పిజ్జా' అనే పేరు కూడా హైప్ కోసమే పెట్టారు తప్పితే దీనికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు.

(ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?)

ఎవరెలా చేశారు?
ఇందులో నలన్ అనే పాత్రలో నటించిన అశ్విన్ కాకుమాను ఫరిది మేరకు యాక్ట్ చేశాడు. అతడి లవర్ కాయల్‌గా చేసిన పవిత్రా మారిముత్తుకు పెద్దగా స్కోప్ దొరకలేదు. కథకు కీలకమైన రోల్స్‌లో నటించిన అభి నక్షత్ర, అనుపమ కుమార్ పర్వాలేదనిపించారు. మిగిలిన వాళ్లందరూ ఓకే ఓకే. హీరోహీరోయిన్ దగ్గర నుంచి ఎవరి యాక్టింగ్ కూడా ఏమంత గొప్పగా అయితే లేదు.

టెక్నికల్ విషయాలకొస్తే హారర్ సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం. 'పిజ్జా 3' చిత్రంలో సంగీతం పరంగా పాస్ మార్కులే పడ్డాయి. సినిమాటోగ్రఫీ మరింత బెటర్‌గా ఉండాల్సింది. ఫస్టాప్ నిడివి విషయంలో ఎడిటర్ కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఫైనల్‌గా దర్శకుడు మోహన్ గోవింద్ గురించి చెప్పుకోవాలి. హారర్ సినిమా అంటే రొటీన్‌గా దెయ్యం, దానికి ఓ ప్లాష్ బ్యాక్ అన్నట్లు కొత్తగా ట్రై చేసి ఉండాల్సింది.  ఓవరాల్‌గా చెప్పుకుంటే 'పిజ్జా 3' చూడటానికి బాగానే ఉన్నా.. దెయ్యం మాత్రం పెద్దగా భయపెట్టలేదు.

- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement