
భువనేశ్వర్: ఓలీవుడ్ స్టార్ హీరో, యాక్టర్ మిహిర్ దాస్(63) మంగళవారం కన్నుమూశారు. కటక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఓలీవుడ్ సినీ కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం కొన్నిరోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. బహుళ అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
మయూర్‌భంజ్ జిల్లాలోని బరిపదలో 1959 ఫిబ్రవరి 11వ తేదీన మిహిర్ దాస్ జన్మించారు. 1979లో విడుదలైన తొలి కమర్షియల్ చిత్రం మధుర విజయ్ సూపర్ హిట్ కావడంతో ఆయన దశ తిరిగింది. లక్ష్మీ ప్రతిమ, ఫెరి ఆ మో సున్నా భొవుణి చలన చిత్రాలు ఆయనకు రాష్ట్ర ఫిల్మ్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు సాధించిపెట్టాయి. రాఖీ బంధిలి మో రొఖిబొ మొనొ, ప్రేమొ ఒఢెయి ఒక్షొరొ చలన చిత్రాల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును ఆయన అందుకున్నారు.
ప్రేక్షక హృదయాల్లో స్థానం సుస్థిరం..
అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మిహిర్ దాస్ స్థానం సుస్థిరం సంతాపం ప్రకటించారు. ఒడియా చలన చిత్ర రంగం ప్రముఖ నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
–ప్రొఫెసరు గణేషీ లాల్, రాష్ట్ర గవర్నరు
ఉన్నత శ్రేణి నటుడిని కోల్పోయింది..
రాష్ట్ర చలన చిత్ర రంగం ఉన్నత శ్రేణి నటుడిని కోల్పోయింది. బహుముఖ నటుడిగా మిహిర్ దాస్ పేరొందారు. 3 దశాబ్దాలుగా తిరుగులేని నటుడిగా హవా కొనసాగించి, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన లేరన్న వార్త మనసుని కలచివేసింది.
– బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ గవర్నరు
ఒడియా చిత్ర రంగానికి తీరని లోటు..
మిహిర్ దాస్ మరణం ఒడియా చలన చిత్ర రంగానికి తీరని లోటు. తనదైన నటన, ప్రతిభాపాటవాలతో భావితరాలకు ప్రేరణగా నిలిచారు. ఓలీవుడ్ ఓ మంచి నడుడిని కోల్పోయింది.
– నవీన్ పట్నాయక్, ముఖ్యమంత్రి
అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన నటుడు..
ఓలీవుడ్‌లో అత్యంత ప్రేక్షాకాదరణ ఉన్న నటుడిగా మిహిర్ గుర్తింపు సాధించారు. ఆయన నటనతో ఒడియా సినిమాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన మరణం తీరని లోటు
– సూర్యనారాయణ పాత్రో, రాష్ట్ర శాసనసభ స్పీకరు