మొన్న జనవరి 31తో ప్రీతి జింటాకు 46 ఏళ్లు నిండాయి. బాలీవుడ్‌లో టాప్ స్టార్ అయి ఆ తర్వాత అంట్రప్రెన్యూర్‌గా మారిన ప్రీతి తను సినిమాల్లోకి వచ్చేందుకు కాయిన్ ఎగరేసి నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ‘లిరిల్’ యాడ్ చేసి లిరిల్ గర్ల్‌గా క్రేజ్ సంపాదించుకుంది ప్రీతి జింటా. తండ్రి చిన్నప్పుడే మరణించడం, కుటుంబానికి తనే ఆధారం కావడంతో ఈ సిమ్లా అమ్మాయి త్వరత్వరగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (క్రిమినల్ సైకాలజీ) చేసి ముంబై చేరుకుంది. అక్కడ మోడల్‌గా కెరీర్ మొదలెడితే సహజంగానే బాలీవుడ్ కన్ను పడింది.
‘దర్శకుడు శేఖర్ కపూర్ నన్ను మొదటగా ‘తర రమ్ పమ్’ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. ఆయనను నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద దర్శకుడు. కాని నాకు సినిమా కెరీర్ పట్ల అప్పటికి ఆలోచన లేదు. విధి నిర్ణయం అలాగే ఉంటే తప్పక నటిస్తాను అని ఆయనతో చెప్పి ఆయన దగ్గరే కాయిన్ ఎగరేశాను. బొమ్మ పడితే సినిమా చేస్తాను. బొరుసు పడితే చేయను అనుకున్నాను. బొమ్మ పడింది. సినిమా ఒప్పుకున్నాను’ అని అప్పటి సంగతి గుర్తు చేసుకుందామె.
అయితే ఆ సినిమా కొన్నాళ్లకు మూలన పడింది. ప్రీతి జింటా మణిరత్నం ‘దిల్ సే’ తో మొదట పరిచయం అయ్యి స్టార్‌గా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వేరే టీమ్ ‘తర రమ్ పమ్’ చేసింది సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలతో. ‘అది కూడా విధి నిర్ణయమే కావచ్చు’ అంటుంది ప్రీతి. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రీతి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా ఆమె ఎగరేసిన కాయిన్‌కు మనం థ్యాంక్స్ చెప్పాలి. అది బొమ్మ పడటం వల్లే కదా ఈ చక్కటి బొమ్మ తెర మీద కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment