ఆసుపత్రిని తలపించే అన్నాత్తే లొకేషన్‌! | Rajinikanth Annaatthe shoot resumes in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిని తలపించే అన్నాత్తే లొకేషన్‌!

Published Sat, May 1 2021 1:10 AM | Last Updated on Sat, May 1 2021 11:27 AM

Rajinikanth Annaatthe shoot resumes in Hyderabad - Sakshi

సరిగ్గా నాలుగు నెలల క్రితం రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ సెట్‌లో నలుగురికి కరోనా సోకి, షూటింగ్‌ నిలిచిపోయింది. రజనీ కూడా హైబీపీతో హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని ‘అన్నాత్తే’ షూటింగ్‌ని ఆ మధ్య చెన్నైలో ఆరంభించారు. మార్చి 12 నుంచి హైదరాబాద్‌లో మళ్లీ షూటింగ్  చేస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా కొన్ని పెద్ద చిత్రాల షూటింగ్స్‌కి బ్రేక్‌ పడిన నేపథ్యంలో ‘అన్నాత్తే’ లొకేషన్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ విశేషాలు...

► చిత్రబృందంలో ప్రతి ఒక్కరూ పీపీఈ సూట్‌ను ధరించాల్సిందే. సినిమాటోగ్రాఫర్‌కి కూడా మినహాయింపు లేదు. ప్రస్తుతం ‘అన్నాత్తే’ లొకేషన్‌కు ఎవరైనా వెళితే సినిమా షూటింగ్‌కు వెళ్లినట్లుగా ఉండదట. ఏదో ఆసుపత్రికి వెళ్లిన భావన కలుగుతుందట. జాగ్రత్తలు ఆ స్థాయిలో ఉన్నాయని తెలిసింది.

► ఇక హీరో రజనీకాంత్‌ను ప్రత్యేక జాగ్రత్తలతో చూసుకుంటున్నారు దర్శకుడు శివ. చిత్రయూనిట్‌లోని ఎవరైనా సరే రజనీకాంత్‌కు పది అడుగుల దూరం నుంచి మాట్లాడాల్సిందే. ఇక రజనీకాంత్‌తో కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్న ఆర్టిస్టులు మాత్రమే చిత్రీకరణ అప్పుడు ఆయనకు దగ్గరగా ఉంటారు. ఆ ఆర్టిస్టులు కూడా షాట్‌ అయిపోయిన వెంటనే వారికి కేటాయించిన గదుల్లోకి వెళ్లిపోవాలి.

► రజనీకాంత్‌కు సన్నివేశాన్ని వివరించేందుకు దర్శకుడు శివ కూడా నాలుగు అడుగుల దూరాన్ని పాటిస్తున్నారట. అలాగే రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరో సెట్‌లో ఉన్నప్పుడు చిత్రబృందంలోని వారు, ఇతర నటీనటుల వ్యక్తిగత సహాయకులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటికి పూర్తిగా అడ్డుకట్ట వేశారట శివ. మేకప్‌ వేసేందుకు రజనీ వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఆయనకు అత్యంత దగ్గరగా వెళతారు. అలాగే రజనీకాంత్‌తో కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నవారు మినహా ఇతర నటీనటులెవరూ లొకేషన్‌కి రాకూడదనే నిబంధన విధించారట.}

► ప్రçస్తుతం రజనీకాంత్, నయనతార, మీనా కాంబినేషన్‌లో చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ షెడ్యూల్‌ మే 10 వరకు జరుగుతుంది. ‘అన్నాత్తే’ చిత్రాన్ని నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే కోవిడ్‌ సమస్యలను ఎదుర్కొని మరీ షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో థియేటర్స్‌ మూసి ఉన్నప్పటికీ నవంబరుకి పరిస్థితుల్లో మార్పు వస్తుందని ‘అన్నాత్తే’ టీమ్‌ భావిస్తోందట. అందుకే ఈ కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ తన వయసు (70)ని కూడా పక్కనపెట్టి రజనీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement