సినిమాలకు, రాజకీయాలకు అత్యంత సుపరిచితుడు రామరాజన్. దాదాపు 44 చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సక్సెస్‌ఫుల్ నటుడీయన. పలు చిత్రాలకు దర్శకత్వం సైతం వహించిన ఈయన రాజకీయ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీర విధేయుడు రామరాజన్. కాగా సినీ, రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన గతంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. దాని నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది.
పద్నాలుగేళ్ల తర్వాత..
సుమారు 14 ఏళ్ల తర్వాత రామరాజన్ మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అదీ కథానాయకుడిగా! అలా ఆయన నటించిన చిత్రం సామానియన్. ఎక్సట్రా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించిన ఇందులో రాధారవి, ఎంఎస్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
హీరోయిన్ లేదు
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మీడియాతో ముచ్చటించింది. రామరాజన్ మాట్లాడుతూ సామానియన్ చిత్రంలో నటించడానికి ముఖ్య కారణం కథ అన్నారు. దర్శకుడు రాకేష్ చెప్పిన కథ నచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరన్నారు. ఒక సగటు సామాన్యుని కోపమే ఈ చిత్రమని చెప్పారు. మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన, లేదని సినిమాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొన్ని కథలను వింటున్నానని వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment