
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులపై నటి రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. #JusticeforSushant అనేది ఓ బోగస్ ప్రచారం అంటూ విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సతీశ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో సీబీఐ విచారణ ఓ కొలిక్కి వచ్చేంత వరకు ఎదురుచూడాలి. కానీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు, ఎయిమ్స్ వైద్యులపై కొంత మంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన సమాధానం రాకపోవడంతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఇక సుశాంత్‌కు న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్నవాళ్లదంతా ఓ బోగస్ ప్రచారం. డాక్టర్లు ఏం చెప్పారో విన్నారు కదా. (చదవండి: కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!)
మీలాంటి వాళ్లంతా సిగ్గుతో తలకు ఉరేసుకోవాలి. ఎందుకంటే మీ నటుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందన్న విషయం బయటకు వచ్చింది. అతడి కుటుంబం వల్ల, సోకాల్డ్ మీడియా సృష్టించిన అసత్య ప్రచారాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అతడితో సహ జీవనం చేసిన నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక రియా తరఫున సతీశ్ మనేషిండే వాదిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment