'వద్దు బావ తప్పు' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది నటి ప్రమీలా రాణి. వేద, బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో అందరినీ మంత్రముగ్దులు చేసిన ఆమె సహజ నటిగా పేరు తెచ్చుకుంది. ఏడుపు సన్నివేశాల్లో కూడా గ్లిజరిన్ లేకుండా అతి సాధారణంగా నటించగల సామర్థ్యం ఆమెది. అందుకే ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ నటిగా రాణిస్తోంది. 85కు పైగా సినిమాలు చేసిన బామ్మ తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టింది.
'నేను 107 ఎకరాల ఆసామికి పుట్టాను. కానీ పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు ఇస్నోఫియా అనే జబ్బు ఉండేది. మబ్బు పట్టినప్పుడు ఆయాసం వచ్చేది. 1997 నుంచే షుగర్ కూడా ఉంది. ఈ జబ్బులతో ఎలాగోలా నెట్టుకొస్తున్నాను. పెళ్లి చేసుకున్నాక భరతనాట్యం చేసేదాన్ని. పలు స్టేజీపై నృత్యం చేసేదాన్ని. అయితే పెళ్లైన కొత్తలో నాకు పిల్లలు పుట్టరని చెప్పడంతో నా భర్త విడాకులిచ్చాడు. మేము ఇచ్చిన డబ్బు కూడా తిరిగిచ్చేశాడు.
ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పటికే అతడికి పెళ్లైంది. ఆ విషయం దాచి నన్ను మోసం చేశాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పారు.. కానీ నెల తప్పాను. 8వ నెలలో రైల్వే ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్తే..నీకు గర్భం లేదు ఏం లేదని డాక్టర్ కసురుకుంది. తర్వాత రెండు నెలలకే ఓ ఆస్పత్రిలో నిండు పౌర్ణమినాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాత పాప, కొడుకు పుట్టారు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
1986 మార్చి 26న భర్త చనిపోయాడు. 23 ఏళ్లకే భర్త చనిపోవడంతో జీవితం ముగిసిపోయినట్లనిపించింది. నాటకాలు వేస్తూ, సినిమాలు చేస్తూ కొద్దికొద్దిగా సంపాదించడం మొదలుపెట్టాను. అలా తక్కువకాలంలోనే అందరి నోట్లో నాలుకలా మారిపోయాను. డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి విజయరాణి నాకు స్నేహితురాలు. నా దగ్గర రూ.15 లక్షలు తీసుకుంది. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. అలా ఆమెకు డబ్బులిచ్చి మోసపోయాను' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment