డేంజర్‌ జోన్‌లోకి 'డేంజర్ పిల్ల' .. శ్రీలీల చేస్తున్న తప్పేంటి? | Sreeleela Phased Back To Back Flops, Her Career Fell Into Danger Zone | Sakshi
Sakshi News home page

Sreeleela: డేంజర్‌ జోన్‌లోకి 'డేంజర్ పిల్ల' .. శ్రీలీల చేస్తున్న తప్పేంటి?

Published Tue, Jan 16 2024 6:04 PM | Last Updated on Wed, Jan 17 2024 9:17 PM

Sreeleela Phased Back To Back Flops, Her Career Fell Into Danger Zone - Sakshi

కొంతమంది హీరోయిన్లకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్న సరే.. సదరు హీరోయిన్‌కి మాత్రం వరుస అవకాశాలు వస్తాయి. ఒక్క హిట్‌ పడినా సరే.. వెంటనే స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోతారు. అలాంటి హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తొలి సినిమా పెళ్లి సందడిలో తనదైన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రెండో సినిమా ‘ధమాకా’ సూపర్‌ హిట్‌ కావడం.. దానికి తన గ్లామర్‌, డ్యాన్స్‌ ప్రధాన కారణం అవ్వడంతో..రెండో సినిమాకే శ్రీలీల స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.

ధమాకా తర్వాత టాలీవుడ్‌ మొత్తం శ్రీలీల పేరునే జపించింది. బడా బ్యానర్స్‌ అన్నీ శ్రీలీలకు అడ్వాన్స్‌లు ఇచ్చేశాయి. శ్రీలీల కూడా  తన పాత్ర ప్రాధాన్యతను చూసుకోకుండా హీరో, బ్యానర్‌ పేర్లను చూసి సినిమాలకు సైన్‌ చేసింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లింది. ఈ మధ్య కాలంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి.

రామ్‌ ‘స్కంధ’, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’, నితిన్‌ ‘ఎక్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చిత్రాలన్నింటిలోనూ శ్రీలీలనే హీరోయిన్‌. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. డిజాస్టర్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన ‘భగవంత్‌ కేసరి’మాత్రం హిట్‌ టాక్‌కి సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకే వెళ్లింది. ఇలా వరుస ఫ్లాపులు వచ్చినా శ్రీలీల మాత్రం ధైర్యం కోల్పోలేదు. దానికి కారణం ‘గుంటూరు కారం’.

కెరీర్‌లోనే తొలిసారి మహేశ్‌ బాబు లాంటి బిగ్‌ స్టార్‌ సరసన నటించే అవకాశం శ్రీలీలకు వచ్చింది. ఈ చిత్రం కచ్చితంగా హిట్‌ కొట్టి..మళ్లీ తన గురించి టాలీవుడ్‌ చర్చించుకునేలా చేస్తుందని శ్రీలీల భావించింది. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్‌ టాక్‌ని సంపాదించుకుంది. అంతేకాదు శ్రీలీల పాత్రపై విమర్శలు కూడా వచ్చాయి.  దీంతో శ్రీలీలకు వచ్చిన ఒక్కగానొక్క అవకాశం కూడా చేజారిపోయినట్లైయింది.  గతంలో పూజా హెగ్డే, కృతీశెట్టి  లాంటి హీరోయిన్లు కూడా ఇలాంటి తప్పులే చేసి.. తెలుగు తెరకు కనుమరుగైపోయారు.  ఇప్పుడు శ్రీలీల కూడా ఆ లిస్ట్‌లోకి చేరబోతుందని టాలీవుడ్‌ పండితులు అంటున్నారు. 

శ్రీలీల చేస్తున్న తప్పేంటి?
శ్రీలీల మంచి అందగత్తె. తెరపై గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. డాన్స్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ..  కథల ఎంపిక విషయంలో మాత్రం తప్పు చేస్తోందని సీనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్‌ హీరో, పెద్ద బ్యానర్‌ పేర్లను మాత్రమే చూస్తుంది కానీ.. నటనను ప్రదర్శించే క్యారెక్టర‍్లను మాత్రం ఎంచుకోవడం లేదని అంటున్నారు. ఇక నుంచైన ఫెర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న పాత్రల్లో నటించపోతే.. స్టార్‌ హీరోయిన్‌ అనే కూర్చి నుంచి శ్రీలీల దిగిపోవడం ఖాయమని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో పవన్‌కి జోడీగా నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement