‘‘స్టార్ అవ్వడం అనేది మన చేతుల్లో లేదు. అయితే ఎంచుకునే పాత్రలతో మంచి యాక్టర్ అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ యాక్టర్ అనిపించుకోవడం అనేది చాలా కష్టం. ‘స్టార్’ లేదా ‘యాక్టర్’ అని ఎవరైనా నాకు అప్షన్ ఇస్తే.. యాక్టర్ అవుతాననే చాలెంజ్‌నే తీసుకుంటాను’’ అని శ్రీ విష్ణు అన్నారు. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు చెప్పిన విశేషాలు..
►‘సామజవరగమన’లో బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడి పాత్రలో నటించాను. థియేటర్ బాక్సాఫీస్‌లో ఉద్యోగం చేస్తుంటాడు బాలసుబ్రహ్మణ్యం. సో.. కొంతమంది హీరోల డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. నవ్వించడమే పనిగా పెట్టుకుని మేం తీసిన సినిమా ఇది. యూత్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్ పాయింట్ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఇలాంటి పాయింట్ రాలేదనే అనుకుంటున్నాం.
►ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఎక్కవైపోయారు. పెద్ద దర్శకులు తక్కువైపోయారు. కొన్నిసార్లు స్టార్ డైరెక్టర్స్‌కే స్టార్ హీరోలు దొరకడం లేదు కూడా. ఇక స్టార్ దర్శకులు మాలాంటి వారితో సినిమాలు చేయాలంటే అది టఫ్ అవుతుంది. దీనికి తోడు మార్కెట్ సమీకరణాలు కూడా ఉంటాయి. అలాగే పెద్ద దర్శకులు కొంతమంది దాదాపు రెండేళ్ల వరకూ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. నేను సమయం వృథా కాకూడదని కొత్త దర్శకులతో, వీలైతే నేను ఇంట్రడ్యూస్ చేసిన వారితోనే మళ్లీ సినిమాలు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటాను.
►విలన్ రోల్స్ చేయడం నాకు ఇష్టమే. అయితే ‘వీరభోగ వసంతరాయలు’, ‘తిప్పరా మీసం’ సినిమాల్లో నెగటివ్ టచ్ ఉండే రోల్స్ చేస్తే ప్రేక్షకులు అంతగా యాక్సెప్ట్ చేయలేదనిపించింది. అందుకే విలన్ రోల్స్ చేయాలనుకోవడం లేదు.
►ప్రస్తుతం హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే ‘రాజరాజ చోర’కు ప్రీక్వెల్‌గా హసిత్ గోలి దర్శకత్వంలోనే ఓ సినిమా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment