పాపం ఫడ్జ్‌.. సుశాంత్‌ రాక కోసం | Sushant Singh Rajput Dog Fudge Heartbreaking Video | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. సుశాంత్‌ కోసం పెంపుడు కుక్క నిరీక్షణ

Published Fri, Aug 7 2020 6:58 PM | Last Updated on Fri, Aug 7 2020 7:03 PM

Sushant Singh Rajput Dog Fudge Heartbreaking Video - Sakshi

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిభ.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అతడి కుటుంబ సభ్యుల పరిస్థితి మరీ దారుణం. ఇదిలా ఉంటే ఇక సుశాంత్‌ పెంపుడు కుక్క ఫడ్జ్‌ పరిస్థితి చెప్పడానికి మాటలు చాలడం లేదు. ఇన్ని రోజులు తనను ఎంతో ప్రేమగా చూసిన యజమాని.. తనతో ఆడుకున్న వ్యక్తి నెల రోజుల నుంచి అస్సలు కంటికే కనిపించక పోవడంతో ఫడ్జ్‌ బెంగ పెట్టుకుంది. ఎక్కడికి వెళ్లాడో తెలీదు.. ఎప్పుడు వస్తాడో తెలీయక అతని రాక కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. తలుపు చప్పుడైతే చాలు యజమాని వచ్చాడేమో అని ఆత్రంగా చూడటం.. కాదని తెలీడంతో నిరాశ చెందడం. ఇదే గత కొద్ది రోజులుగా ఫడ్జ్‌ దినచర్యగా మారిందంటున్నారు సుశాంత్‌ కుటుంబ సభ్యులు. ('హ‌ర‌హ‌ర మ‌హాదేవ్' సుశాంత్ సోద‌రి)

ఈ క్రమంలో సుశాంత్‌ మేనకోడలు మల్లికా, ఫడ్జ్‌ ఎదురుచూపులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. దీనిలో ఫడ్జ్‌ సుశాంత్‌ లోపలికి వస్తాడేమో అనే ఆశతో.. ఓపికగా తలుపు వైపే చూస్తూ ఉంది. కానీ యజమాని ఇక ఎన్నటికి తిరిగి రాడనే వాస్తవం దానికి తెలీదు పాపం. నల్ల లాబ్రడార్‌ కుక్క అయిన ఫడ్జ్‌ అంటే సుశాంత్‌కు ఎంతో ఇష్టం. ఖాళీగా ఉంటే ఎక్కువ సమయాన్ని దాంతోనే గడిపేవాడు. అంతేకాక ఫడ్జ్‌తో ఆడుతున్న వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేవాడు. అయితే సుశాంత్‌ మరణించినప్పుడు ఫడ్జ్‌ ఎక్కడ ఉందనే దాని గురించి సరైన సమాధానం లేదు. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన)

సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత అతడి కుటుంబ సభ్యులు ఫడ్జ్‌ను పట్నాకు తీసుకెళ్లారు. గతంలో సుశాంత్‌ మృతిని తట్టుకోలేక ఫడ్జ్‌ కూడా చనిపోయిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈడీ.. రియా చక్రవర్తిని విచారిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement