
ప్రఖ్యాత గాయకురాలు పి. సుశీల తన బయోపిక్ తీయడానికి సహాయం చేయమని తనను అడిగారని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. రెహమాన్ నిర్మించిన తొలి చిత్రం ‘99 సాంగ్స్’. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ సినిమాను చూడమని పి. సుశీలను కోరారట రెహమాన్. ఈ విషయం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ఇటీవల సుశీలమ్మతో మాట్లాడినప్పుడు ‘99 సాంగ్స్’ సినిమాను చూశారా? అని అడిగాను. ఒకవేళ చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉందని చెప్పాను.
అక్కడే ఉన్న సుశీలమ్మ సోదరుడు నాతో మాట్లాడారు. ఆమెకు ‘99 సాంగ్స్’ తెలుగు వెర్షన్ చూపించమని ఆయనతో చెప్పాను. సినిమా చూసిన తర్వాత సుశీలమ్మ ఫోన్ చేసి, ‘సినిమా చాలా బాగుంది’ అని ప్రశంసించారు. అంతేకాదు.. ‘‘నా కథను కూడా ‘99 సాంగ్స్’ సినిమాలా బాగా తీయాలి. హెల్ప్ చేస్తారా?’’ అని అడిగారు. సుశీలమ్మ లెజండ్. వేల పాటలు పాడారు. నా ఫేవరెట్ సింగర్. అలాంటి సుశీలమ్మగారు మా సినిమాను మెచ్చుకోవడం, తన బయోపిక్ గురించి అడగడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు.