ముంబై: ‘‘బొద్దుగా ఉన్న కారణంగా గత రెండేళ్లలో ఎన్నోసార్లు బాడీ షేమింగ్ బారిన పడ్డాను. నా శరీరాకృతి గురించి కొన్నిసార్లు నా ముందే మాట్లాడేవాళ్లు కొంతమంది. మరికొంత మంది మాత్రం నా వెనుక గుసగుసలాడేవారు. నిజానికి ‘నువ్వు లావుగా ఉన్నావు’ చెప్పేవాళ్లు చాలా అరుదుగా మనకు తారసపడతారు. అలాంటి వాళ్లతో ఎటువంటి బాధ ఉండదు. కానీ మన ముందు నవ్వుతూ మాట్లాడుతూ, వెనుక మాత్రం మన గురించి చెత్తగా మాట్లాడేవారి ప్రవర్తన వేదనకు గురిచేస్తుంది. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్లకు మనతో ఇబ్బంది ఏమీ ఉండదు. అయినా మనల్ని తక్కువ చేసి చూపేందుకు అలా మాట్లాడతారు. బరువు తగ్గే ప్రయాణంలో ఎన్నెన్నో భావోద్వేగాలను నేను చవిచూశాను’’అంటూ నటి తనుశ్రీ దత్తా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. బరువు పెరిగిన కారణంగా మానసిక వేదనకు గురవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. (చదవండి: సినిమాల కోసం యూఎస్ డిఫెన్స్ జాబ్ వదులుకున్నాను)
కాగా భారత్‌లో మీటూ ఉద్యమానికి బాటలు వేసిన తనుశ్రీ దత్తా రీఎంట్రీకి సిద్ధమైనట్లు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 15 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్న ఆమె, సినిమాల ప్రేమతో అమెరికాలో డిఫెన్స్ ఉద్యోగం వదులుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తనకు ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు. ఇక బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తా, ప్రస్తుతం తాను దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని.. ఇవే గాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్‌లు తనను సంప్రదించినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి షూటింగ్‌లు వాయిదా పడ్డాయని, పరిస్థితుల చక్కబడి అంతా సవ్యంగా సాగితే త్వరలోనే ప్రేక్షకులు తనను మరోసారి వెండితెరపై చూస్తారని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment