ఎవరెస్ట్‌ని అధిరోహించిన ఎడ్మండ్, టెన్జింగ్, ఇన్‌సెట్‌లో టామ్ హిడిల్‌స్టన్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ని అధిరోహించడం చాలా కష్టం అనే అభిప్రాయాన్ని అబద్ధం చేశారు ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే. న్యూజిల్యాండ్‌కి చెందిన ఎడ్మండ్, నేపాల్‌కి చెందిన టెన్జింగ్ 1953లో ఎవరెస్ట్ చేరుకుని, అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఇద్దరూ సాధించిన చరిత్ర నేపథ్యంలో హాలీవుడ్‌లో ‘టెన్జింగ్’ టైటిల్‌తో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రంలో ఎడ్మండ్ హిల్లరీ పాత్రకు టామ్ హిడిల్‌స్టన్‌ని ఎంపిక చేశారు. యాత్ర నాయకుడు కల్నల్ జాన్ హంట్ పాత్రను విల్లెం డాఫో పోషించనున్నారు. టెన్జింగ్ నార్గే పాత్రకు సంబంధించిన ఎంపిక జరుగుతోంది.
షెర్పా (పర్వతారోహకులు) కమ్యూనిటీతో సన్నిహిత సంబంధాలు ఉన్న జెన్నిఫర్ పీడోమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2015లో ‘షెర్పా’ పేరిట జెన్నిఫర్ పీడోమ్ ఓ డాక్యుమెంటరీ తెరకెక్కించారు కూడా. అప్పుడు కొందరు పర్వతారోహకుల అనుభవాలను సేకరించి, ‘షెర్పా’ని చిత్రీకరించారు. తాజాగా జెన్నిఫర్ తెరకెక్కించనున్న ‘టెన్జింగ్’కి ల్యూక్ డేవిస్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. లిజ్ వాట్స్, ఎమిలే షెర్మాన్, ఇయాన్ కానింగ్ తదితరులు నిర్మించనున్నారు. ‘‘ఒక సాహస యాత్రను తెరపై ఆవిష్కరించడానికి ఆసక్తిగా ఉన్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని వచ్చే ఏడాది ఆరంభించాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment