సాక్షి, హైదరాబాద్: నితిన్ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ చిత్రం పేరు చెప్పి, ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆ చిత్రాన్ని నామినేట్ చేస్తామంటూ నమ్మబలికారు. ఆయన నుంచి రూ. 66 వేలు డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. వెంకీ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం అద్భుతంగా ఉందని చెప్పారు. దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆరు కేటగిరీల్లో నామినేట్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నాడు.
తాను ఆ ప్యానల్‌లో కీలక సభ్యుడిని అని, గోప్యత వహించాల్సిన అంశం కావడంతో రహస్యంగా ఇలా ఫోన్ చేశానని నమ్మబలికాడు. ఆ ఫెస్టివల్‌లో నామినేట్ చేయడానికి ఒకో కేటగిరికి రూ.11 వేలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. దీనికి వెంకీ అంగీకరించడంతో ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నేరగాడు అందులో డబ్బు డిపాజిట్ చేయమన్నాడు. సైబర్ నేరగాడు చెప్పింది నిజమేనని నమ్మిన వెంకీ మొత్తం రూ.66 వేలు ఆ బ్యాంకు ఖాతాలోకి పంపాడు. మరుసటి రోజు మళ్లీ డైరెక్టర్ వెంకీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు కొత్త కథ చెప్పాడు.
ఆరింటిలోనూ మూడు కేటగిరిలకు సంబంధించి నామినేట్ చేసే విషయంలో చిన్న పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పాడు. వాటిని సరిచెయ్యడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందంటూ చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ సదరు చిత్ర నిర్మాత నామినేషన్ పర్వం వద్దన్నారంటూ చెప్పి తాత్కాలికంగా దాట వేశారు. ఆపై పూర్వాపరాలు పరిశీలించిన ఆయన జరిగిన మోసం తెలుసుకున్నారు. దీనిపై సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాడు వినియోగించిన ఫోన్ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్
'భీష్మ' డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్
నో చెప్పిన చెర్రీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్!
Comments
Please login to add a commentAdd a comment