
సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం కారణంగా శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నై రామాపురంలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1964–74 మధ్య కాలంలో ఇండియ¯Œ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు ఢిల్లీ గణేష్. కళలపై ఉన్న ఆసక్తితో ఢిల్లీకి చెందిన దక్షిణ భారత నాటక సభలో సభ్యుడిగా చేరారు. అనంతరం సినీ రంగ ప్రవేశం చేశారు.
కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పట్టణ ప్రవేశం’(1976) చిత్రం ద్వారా నటుడుగా పరిచయమయ్యారాయన. ‘ఎంగమ్మ మహారాణి’ అనే మూవీలో హీరోగా నటించారు కూడా. తమిళంతో పాటు తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. అలాగే పలు సీరియల్స్‌లోనూ, కొన్ని వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఆయన మంచి నటుడే కాదు.. డబ్బింగ్ కళాకారుడు కూడా. పలువురు ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు.
ఢిల్లీ గణేశ్ తెలుగులో ‘జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమి నాగు’ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేడు(సోమవారం) ఉదయం 10 గంటలకు చెన్నైలో ఢిల్లీ గణేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు మాధవన్ గణేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment