
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ మూవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనకు ఆర్జీవీ ‘కనబడుటలేదు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘కనబడుటలేదు’. ఈ మూవీ ఆగస్టు 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు విజయేంద్రప్రసాద్, రామ్‌గోపాల్ వర్మలు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడిన విజయేంద్రప్రసాద్.. ఆర్జీవీలో తనకు మునుపటి దర్శకుడు ‘కనబడుటలేదు’ అని అన్నారు. ఈ మూవీ టైటిల్‌ను వర్మకు ఆపాదిస్తూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఒక మనిషి నాకు కనబడుట లేదు. సినిమా తీస్తానంటూ 1989లో ఓ యువ కెరటం వచ్చింది. ఎక్కడ పని చేసిన, సినిమా తీసిన అనుభవం లేదు. ప్యాషన్‌తో సినిమా తీశాడు. కాలేజీ కుర్రాళ్లతో సైకిల్ చెయిన్ పట్టించిన ఆ మనిషి నాకు కనబడటం లేదు. ఆ తర్వాత శ్రీదేవి అందాలను ఎవరూ చూపనంత గొప్పగా చూపించాడు. జామురాతిరి జాబిలమ్మ అనే పాటతో కుర్రకారుకు పిచ్చెక్కించిన ఆ డైరెక్టర్ నాకు కనబడటలేదు. అంతేగాక సత్య, రంగీలా లాంటి అద్భుతమైన సినిమాలు తీసి వందల మంది డైరెక్టర్లను, ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ వ్యక్తి నాకు కనబడుటలేదు. మళ్లీ అతన్ని చూడాలని ఉంది’ అంటూ ఆర్జీవీపై తనదైన కామెంట్స్ చేశారు. అయితే విజయేంద్రప్రసాద్ మాట్లాడుతున్నంత సేపు ఆర్జీవీ కింద కూర్చోని ముసిముసి నవ్వులు చిందించారు.
Comments
Please login to add a commentAdd a comment