
‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలి
ములుగు: మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని అదివాసీ, గిరిజన, దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో రాయల్‌ప్లాజాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మావోయిస్టు పార్టీలతో వెంటనే శాంతి చర్చలు జరపాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లోని కర్రిగుట్టలపై మావోయిస్టులు ఉన్నారనే నెపంతో సాయుధబలగాలు బాంబులతో దాడి చేయడం వెంటనే మానుకోవాలని కోరారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాల చర్యల కారణంగా నిరాయుధులైన ఆదివాసీ గిరిజన మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా ప్రజలు భయానక జీవితాన్ని గడుపుతున్నారన్నారు. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన సంఘటనపై యావత్ ప్రపంచం స్పందించిన సమయంలో కర్రిగుట్టల విధ్వంసాన్ని కేంద్రం నేరుగా చేపట్టడాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను వెనక్కి రప్పించుకుని మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు రేపు ములుగు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు మెమోరాండం అందించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తుండుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, గోర్‌సభ జాతీయ అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, సోమ రాంమూర్తి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ కిషన్, గోర్ సభ రాష్ట్ర అధ్యక్షుడు మంగిలాల్, ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, మేడారం ట్రస్టుబోర్డు తాత్కాలిక చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టు పార్టీలతో
శాంతి చర్చలు జరపాలి
ప్రజాసంఘాల నాయకుల డిమాండ్