సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి
నాగర్‌కర్నూల్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను యువత కాపాడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని సాయిగార్డెన్‌లో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై యువజనోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, దానిని బయటకు తీసేందుకు యువజనోత్సవాలు ఉపయోగపడతాయన్నారు. స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే సాధించనిది ఏదీ లేదన్నారు. యువత చెడు మార్గంలో పయనించకుండా సన్మార్గంలో పయనించాలన్నారు. విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక కళల్లో నైపుణ్యం సాధించాలన్నారు. మండల స్థాయిలో వివిధ జానపద కళల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించేలా కృషిచేసి జిల్లాకు జాతీయ స్థాయిలో మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత వివిధ జానపద కళల్లో ప్రతిభచాటిన విద్యార్థులకు జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన అధికారులను, నృత్యాలు ప్రదర్శించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాంనాయక్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి పాండు, డీఎస్‌ఓ రాజశేఖర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జానపద నృత్యం చేస్తున్న విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment