అందుబాటులోకి రాని టీ–ఫైబర్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి రాని టీ–ఫైబర్‌ సేవలు

Published Mon, Feb 24 2025 1:39 AM | Last Updated on Mon, Feb 24 2025 11:57 AM

-

పంచాయతీల్లో నిరుపయోగంగా పరికరాలు

ఇంటర్నెట్‌ సౌకర్యం లేక మరుగున పడిన ఈ–పాలన

డిజిటల్‌ సేవలు అందక ప్రజల ఇబ్బందులు

టీ–ఫైబర్‌ సేవల కోసం ఎదురుచూపులు

అచ్చంపేట రూరల్‌: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్‌ సేవలు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతి పనికి సాంకేతికతతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతు వేదికలు, ఇతర ప్రజా సేవల సంస్థలకు అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మిషన్‌ భగీరథ పథకం పైపులైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్‌ కేబుల్‌ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్‌ పరికరాలను సైతం అమర్చారు. అయితే ఇప్పటి వరకు టీ–ఫైబర్‌ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు.

జాడలేని ఈ–పాలన..
పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారితనంతో పాటు డిజిటల్‌ సేవలు అందించాలని గతంలో క్లస్టర్ల వారీగా ఈ–పంచాయతీ ఆపరేటర్లను నియమించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. జిల్లావ్యాప్తంగా 461 గ్రామ పంచాయతీలు ఉండగా.. సుమారు 60 మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయం, వ్యయాలు, జీతభత్యాలు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటి పన్ను తదితర సేవలను ప్రజలకు డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన ఉద్దేశం. 

అయితే పంచాయతీల్లో ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ఈ–పాలన జాడ లేకుండా పోయింది. చాలా వరకు ఈ–పంచాయతీ ఆపరేటర్లు మండల పరిషత్‌ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల్లో ఏమైనా అవాంతరాలుంటే లబ్ధిదారులు మండల పరిషత్‌ కార్యాలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి కార్యదర్శులు చేతి రాత రశీదులను జారీ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా టీ–ఫైబర్‌ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే.. గ్రామాల్లోనే డిజిటల్‌ సేవలు అందుతాయని ప్రజలు కోరుతున్నారు.

పరికరాల బిగింపుతోనే సరి..
జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అవసరమైన టీ–ఫైబర్‌ కేబుల్‌, పరికరాలను సైతం బిగించారు. విద్యుత్‌ సౌకర్యం కోసం సోలార్‌ ఫలకలు, ఇన్వర్టర్‌ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్‌ కూడా నిర్వహించారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్‌ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి.

ఎన్నికలలోగా జరిగేనా..
ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, విజేతల వివరాలు ఇలా ప్రక్రియంతా ఇంటర్నెట్‌ ద్వారానే జరగాల్సి ఉంటోంది. గ్రామాల్లో సేవలు అందుబాటులో లేక మండల పరిషత్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, గ్రామపంచాయతీల్లో ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించకముందే విద్యుత్‌ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో పంచాయతీల్లో రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత మాత్రం తప్పడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement