సన్నగిల్లుతున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

సన్నగిల్లుతున్న ఆశలు

Published Wed, Feb 26 2025 8:26 AM | Last Updated on Wed, Feb 26 2025 8:22 AM

సన్నగ

సన్నగిల్లుతున్న ఆశలు

నాలుగు రోజులైనా దొరకని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ

అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫ లించడం లేదు. ఈ నెల 22న ఘటన జరగగా ఇప్ప టి వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 11 రెస్క్యూ బృందాలు నాలుగు రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నా కనీసం ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. మంగళవారం నాలుగో రోజు కూడా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో బాధిత కుటుంబాల్లో నిరాశ, నిస్పృహ అలుముకోగా.. ఆశలు సన్నగిల్లుతున్నాయి.

సహాయక చర్యలకు ఆటంకం

సొరంగంలో సెగ్మెంట్‌ బిగిస్తుండగా ఏర్పడిన రంద్రం వల్ల నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. బురద, నీటి ప్రవాహంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ తదితర 11 బృందాలకు చెందిన 750 మంది నిపుణులు కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం మరిన్ని బృందాలు రంగంలోకి రానున్నాయి. చెల్లాచెదురైన మిషన్‌ 40 మీటర్ల వద్దకు చేరుకునేందుకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ కూడా ప్రయత్నిస్తున్నారు. నిమిషానికి 3,600 నుంచి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో రెండు 100 హెచ్‌పీ మోటార్లతో నీటిని బయటికి తోడేస్తున్నా ఊట అదుపులోకి రాలేకపోతోంది. రేపటి వరకు నీటి ప్రవాహం తగ్గుతుందనే ఆశాభావం మంత్రుల బృందం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ రెండు క్రేన్‌లను కూడా తెప్పించింది. వాటిని లోపలికి తీసుకెళ్లి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచారు. మరోవైపు పైకప్పు కూలిన ఘటనతో కార్మికుల్లో నెలకొన్న భయం ఇంకా తొలగిపోలేదు. మంగళవారం పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో పలు దఫాలుగా వారితో చర్చలు జరిపి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల షిఫ్టులో వెళ్లాల్సిన బృందం మధ్యాహ్నం ఒంటిగంటకు లోపలికి వెళ్లింది.

నిత్యం సమీక్షలు

సొరంగ ప్రమాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ నాలుగు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ.. వివిధ దేశాలకు చెందిన నిపుణులను రప్పించి సహాయక చర్యలు సాగిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధుల రాకతో వారి భద్రతా ఏర్పాట్లు, అధికారుల హడావుడితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్న వాదన వినిపిస్తోంది.

నీరు, మట్టిని తొలగిస్తేనే..

టన్నెల్‌లో కాంక్రీట్‌ సెగ్మెంట్లతోపాటు నిర్మాణ సామగ్రి, సెగ్మెంట్‌ మిషన్‌, ఇతర సామగ్రి, కన్వేయర్‌ బెల్ట్‌, లోకో ట్రైన్‌ ట్రాక్‌ వంటివి నీటిలో మునిగి, మట్టిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే సెగ్మెంట్ల కింద కానీ, బురదలో కాని బాధితులు చిక్కుకుని ఉంటారని, తొలగింపు ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. శిథిలాలను తొలగించేందుకు వచ్చిన బృందాలు తాళ్లు, పలుగు, పారలతో లోపలికి వెళ్లారు. నీరు, మట్టిని తొలిగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శిథిలాలు తొలగిస్తుంటే ఎక్కడి నుంచి ఏ సమస్య వస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

ఘటనా స్థలానికి కొద్దిదూరంలోనేఆగిపోతున్న రెస్క్యూ బృందాలు

భారీగా వస్తున్న నీటి ఊటతో తీవ్ర ఆటంకం

టన్నెల్‌ లోపలికి వెళ్లిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌

దేవుడిపైనే భారమంటున్న కుటుంబ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
సన్నగిల్లుతున్న ఆశలు 1
1/1

సన్నగిల్లుతున్న ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement