సర్వం.. శివమయం
నేటి మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శైవక్షేత్రాలు
● నల్లమలలో మొదలైన భక్తుల సందడి
● మార్మోగుతున్న శివనామస్మరణ
నల్లమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, అచ్చంపేటలోని శివాలయం, అంబ దేవాలయం, ఉట్లకోనేరు, చింతలబస్తీ శివాలయం, భక్తమార్కండేయ, పల్కపల్లి భవానీ రామలింగేశ్వరస్వామి, ఉప్పునుంతల కేదరేశ్వరుడు, బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయాల్లో ఉత్సవాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.
● ఉమామహేశ్వర క్షేత్రంలో బుధవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 7నుంచి రాత్రి 9గంటల వరకు నిత్యాభిషేకం, అర్చనలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రి 11గంటలకు లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకం, అర్ధరాత్రి 1గంటకు పాపనాశం వరకు పల్లకీసేవ, ఉమామహేశ్వర కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గురువారం తెల్లవారుజామున నందివాహన సేవ, నీరాజన మంత్రం పుష్పాలు, సుప్రభాతం, ఉదయం 7గంటలకు నిత్యాభిషేకం, మహానివేదన ఉంటుంది.
● కొల్లాపూర్ మండలం సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గురువారం శివపార్వతుల ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉంటుంది. సప్తనదుల సంగమ ప్రాంతమైన సంగమేశ్వరాలయం వద్ద కూడా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు.
అచ్చంపేట/కొల్లాపూర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. విద్యుద్దీపాలతో ముస్తాబై కాంతులీనుతున్నాయి. నల్లమలలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ పరమశివుడిని కీర్తిస్తూ తరలివస్తున్నారు. సదాశివుడికి ఇష్టమైన మహాశివరాత్రి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించేందుకు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పరమశివుడు కోటి సూర్యకాంతులతో మహాశివరాత్రి రోజున మహాలింగంగా ఉద్భవించాడని శివపురాణం చెబుతోంది. బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువుల తగవు తీర్చేందుకు వారిరువురి నడుమ పరమశివుడు మహా తేజోమయంగా లింగరూపంలో ఉద్భవించాడని ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది.
తేజో లింగరూపంలో దర్శనం..
మహాశివరాత్రి రోజున పరమశివుడు కమలనాభ, కమలగర్భులిరువురికి తేజో లింగరూపంలో దర్శనమిచ్చాడని లింగ, కూర్మ, శివపురాణాల్లో ఉంది. మహాశివరాత్రి గురించి మరో అంశం కూడా ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పడు వచ్చిన గరళాన్ని పరమశివుడు మింగి సకల లోకాలకు శుభాన్ని కలిగించిన మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజున మహాశివరాత్రిగా ఆచరిస్తున్నట్లు చెబుతారు. శివుడికి ప్రీతిపదమైన మహాశివరాత్రి రోజున రుత్వికులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, లింగోద్భవకాల అభిషేకాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో అర్చకులు, వేదపండితులు మినహా మరెవరినీ గర్భాలయంలోకి అనుమతించరు.
సోమశిలలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయం
ఆలయాల్లో
ప్రత్యేక ఏర్పాట్లు..
సర్వం.. శివమయం
సర్వం.. శివమయం
Comments
Please login to add a commentAdd a comment