ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 5నుంచి 25వ తేదీ వరకు జరిగే పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని.. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఇది వరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవి. ఇక నుంచి ఆ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఓటీపీ ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు ఈ ఏడాది నుంచి అమలులోకి తీసుకువచ్చింది. హాల్ టికెట్‌పై ఉండే బార్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం సమాచారం తెలుస్తుంది.
వసతులపై ఫోకస్..
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వసతులు కల్పించడంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ద్వారా ప్రథమ చికిత్స కోసం సిబ్బందిని నియమించండంతో పాటు తరగతి గదుల్లో చీకటి ఉండకుండా లైట్లు, ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రశ్న పత్రాలను తెరవడం, సీల్ వేయడం వంటి వాటిని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. వీటిని కంట్రోల్ కమాండ్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు.
ఓటీపీ ద్వారా
హాల్‌టికెట్ డౌన్‌లోడ్..
ప్రైవేటు కళాశాలల్లో చరువుతున్న విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓటీపీ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి హాల్‌టికెట్‌పై బార్‌కోడ్ ఏర్పాటు చేశారు. బార్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
అధికారుల నియామకం..
పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 33 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 11మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 33మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, ఆరుగురు కస్టోడియన్లు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు హైపవర్ కమిటీని నియమించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు.
33 పరీక్ష కేంద్రాల ఏర్పాటు..
ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 15 ప్రభుత్వ, 11 ప్రైవేటు జూనియర్ కళాశాలలతో పాటు మూడు బీసీ వెల్ఫేర్, ఒకటి ట్రైబల్ వెల్ఫేర్, ఒక మైనార్టీ, ఒక మోడల్ కళాశాల, ఒక సాంఘిక సంక్షేమ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కొనసాగనున్నాయి. మొత్తం 13,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ 4,899, ఒకేషనల్ 1,578 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జనరల్ 5,576 మంది, ఒకేషనల్ 1,401 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
హాజరుకానున్న 13,454 మంది విద్యార్థులు
నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఓటీపీతో హాల్ టికెట్ డౌన్‌లోడ్‌కు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment