2న వనపర్తికి ముఖ్యమంత్రి రాక
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న వనపర్తి జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీ మల్లు రవి, నేతలతో కలిసి హైదరాబాద్‌లో అభివృద్ధి పనుల నివేదికను సీఎంకు ఆయన అందజేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని హెలీప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణకు సూచనలు చేశారు.
అభివృద్ధి పనులు ఇలా..
జిల్లా జనరల్ ఆస్పత్రిని 500 పడకలకు పెంచడం, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవనం, ఇంటర్మీడియట్ కళాశాల, షాపింగ్ కాంప్లెక్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జిల్లాకు వచ్చే నాటికి పనుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పర్యటనలో తన చిన్ననాటి స్నేహితులతో కొంత సమయం గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
జాగ్రత్తలు పాటించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర చేసే భక్తులు అటవీశాఖ నిబంధనలు పాటిస్తూ.. వారు సూచించిన మార్గంలోనే వెళ్లాలన్నారు. వాహనదారులు వేగంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణం కాకూడదని.. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
వికలాంగుల సంక్షేమంపై చిన్నచూపు తగదు
నాగర్‌కర్నూల్‌రూరల్: వికలాంగుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం వికలాంగుల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమయ్యతో కలిసి పర్వతాలు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వికలాంగుల సంక్షేమంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం తగదన్నారు. వికలాంగులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందించాలని కోరారు. వికలాంగుల హక్కుల సాధనకు సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గగనమోని అంజయ్య, బాలీశ్వర్, కోట్ల గౌతమ్, సైదులు పాల్గొన్నారు.
బకాయి వేతనాలు
చెల్లించండి
అచ్చంపేట రూరల్: పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల శుభ్రతకు నిరంతరం పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. కార్మికులకు ఇచ్చి హామీలను నెరవేర్చడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులు కల్పించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, మల్లేష్, చిట్టెమ్మ, బాలస్వామి, తిమ్మయ్య, సుల్తాన్, నిరంజన్, ఇసాక్ పాల్గొన్నారు.
2న వనపర్తికి ముఖ్యమంత్రి రాక
Comments
Please login to add a commentAdd a comment