ఎల్‌ఆర్‌ఎస్ పుంజుకునేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అనుమతి లేని లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మార్చి 31వ తేదీలోగా రెగ్యులరైజ్ చేసుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని చెప్పింది. దీంతో ఇప్పటి వరకు మందకొడిగా సాగిన ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ.. ఇక వేగవంతం అవుతందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అనధికారిక లేఅవుట్లలో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోని ప్లాట్లకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వం నిర్ణయంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగనుంది. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రెగ్యులరైజ్ ఫీజు కూడా రానుండటంతో రెండు విధాలుగా ఆ శాఖకు ఆదాయం రానుంది.
2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ మొదలు
అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల రెగ్యులరైజ్ కోసం 2020 ఆగస్టులో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దాంతో రూ.వెయ్యి చెల్లించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మున్సిపాలిటీల్లో 1,90,475 మంది దరఖాస్తులు చేసుకోగా, గ్రామ పంచాయతీల్లో 59,525 దరఖాస్తులు వచ్చాయి. వాటి రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది. కానీ ప్లాట్ ఒక చోట ఉండటం, పేర్లు తప్పుగా ఉండటం, ప్రజలు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీనిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అమలు చేయనుంది.
మార్చి 31లోగా రెగ్యులరైజ్ చేసుకునే వారికి..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని నిలిపివేసింది. డీటీసీపీ లేఅవుట్ అనుమతి ఉంటేనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. మరోవైపు గతంలోనే రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లను మాత్రమే రెగ్యులరైజ్ చేసేందుకు అనుమతించింది. అయినా రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతూ వచ్చాయి. అయితే మార్చి 31వ తేదీలోగా ఎవరైతే రెగ్యులర్ చేసుకుంటారో వాటికి 25 శాతం ఫీజులో రాయితీ ఇస్తామని ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించింది. యజమాని ప్లాటును కొన్న సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే లెక్కించి (ప్రస్తుత మార్కెట్ విలువ కాదు) రెగ్యులరైజేషన్ ఫీజు నిర్ణయించి అందులో 25 శాతం రాయితీ ఇవ్వనుంది.
పెరగనున్న రిజిస్ట్రేషన్లు..
చాలా మంది గతంలో అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి కొందరు మాత్రమే రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కొందరి పేర్లు మిస్సయ్యాయి. దాంతో వారు ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోలేకపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడంతో వారు కొత్తగా రెగ్యులరైజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం లభించింది. ప్రభుత్వం ఇచ్చిన రాయితీతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో దరఖాస్తులో జరిగిన పొరపాట్ల కారణంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఆ పరిస్థితిని సరి చేయకపోతే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ల రెగ్యులరైజేషన్‌కు ఆటంకం ఏర్పడే అవకాశం లేకపోలేదు.
ఫ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
ఫ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కూ అవకాశం
ఫ ఎన్నికల కోడ్ తర్వాత అమలుకు కార్యాచరణ
ఫ ప్రభుత్వానికి సమకూరనున్న ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment