
‘కేంద్రం నిధులతో సన్న బియ్యం’
నల్లగొండ టూటౌన్ : సన్న బియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి అన్నారు. ‘సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను బుధవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాలు తెలుసుకోకుండా సన్న బియ్యం తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. సమావేశంలో నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, చింత ముత్యాలరావు, రావెళ్ల కాశమ్మ, జగ్జీవన్ పాల్గొన్నారు.