
పురోగతిలో రాష్ట్రంలో రెండోస్థానం
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)టర్నోవర్‌తో పాటు లాభాలను గడించడంలో పురోగతిని సాధించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిందని చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరంలో రూ.30 కోట్ల లాభాల్లో ఉండగా ప్రస్తుత ఏడాదిలో రూ.42.31 కోట్లకు పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు టర్నోవర్ రూ.2300 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకోగా రూ.2800 కోట్లకు చేరిందని, నెల రోజుల్లో లక్ష్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీబీ పుట్టిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా పురోగతి సాధించిందన్నారు. రైతులకు రూ.115 కోట్ల పంటరుణాలు ఇచ్చామని. రూ.100 కోట్ల డిపాజిట్లను సేకరించామని తెలిపారు. బంగారు ఆభరణాలపైరూ. 623.91 కోట్ల రునాలు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇళ్ల నిర్మాణం కోసం భూమి తనఖాను పెట్టుకుని రూ.35 లక్షల వరకు రుణాలను ఇవ్వడంతో పాటుగా రైతుల పిల్లల విదేశీ ఉన్నత చదువుల కోసం విరివిగా రుణాలను ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా కోళ్లు, గొర్రెలు పెంపకానికి రుణాలు అందిస్తుమన్నారు. బ్యాంకు విస్తరణ కోసం ఉమ్మడి జిల్లాలో అదనంగా తిప్పర్తి, ఆత్మకూరు, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో నూతన బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంకా మరో ఆరు బ్రాంచీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించడం ద్వారా వాటిని ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులు, సహకరిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలను తెలియజేశారు. సమావేశంలో సీఈఓ కె.శశంకర్‌రావు, డీజీఎం నర్మద, ఉపేందర్‌రావు, ఏజీఎం కురవానాయక్, డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, గుడిపాటి సైదులు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి