నంద్యాల(న్యూటౌన్)/చాగలమర్రి/బొమ్మలసత్రం/డోన్ టౌన్: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పలుచోట్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు కొన్ని తప్పిదాలు చేశారు. మొదటి రోజు తెలుగుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 130 కేంద్రాల్లో 24,907 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే 24,512మంది విద్యార్థులు పరీక్ష రాయగా 394 మంది గైర్హాజరయ్యారు. ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాలతో పాటు 20 పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్ అబ్రహం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రం మార్పు
నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ పరీక్ష కేంద్రంలో లైట్లు, ఫ్యాన్లు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం డీఈఓ జనార్దన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఈఓ స్పందిస్తూ బుధవారం జరిగే పరీక్షకు కేంద్రాన్ని పక్కనున్న ఎస్పీజీ జూనియర్ కళాశాలలోకి మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి చెందారు.
అరగంట ఆలస్యంగా ప్రశ్నపత్రం
పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే చాగలమర్రి ఓరియంటల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9.30 గంటలకు ఇవ్వాల్సిన ప్రశ్న పత్రాన్ని అరగంట ఆలస్యంగా 10.00 గంటలకు ఇచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. తెలుగు ప్రశ్నపత్రాలు పాత, కొత్త సిలబస్ ప్రకారం వచ్చాయని, వాటిని గుర్తించి వేరు చేయడంతో 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు.
ముగ్గురికి షోకాజ్ నోటీసులు
నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థికి జీరోవన్‌టీ కాకుండా జీరోత్రీటీ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థి ఆ పరీక్షనే రాశారు. తప్పుడు ప్రశ్నపత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్, చీఫ్ డిపార్టుమెంటల్, డిపార్టుమెంటల్ ఆఫీసర్లకు ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు. ఇన్విజిలేటర్‌ను రిలీవ్ చేశామన్నారు.
పోలీస్ భద్రత పరిశీలన
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. నంద్యాల ఎస్పీజీ హైస్కూల్ పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ భద్రతను ఆయన పరిశీలించారు. విద్యార్థులు నిర్దేశించిన సమయంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఎస్పీతో పాటు సీఐలు కంబగిరిరాముడు, మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎండలో విద్యార్థులు
డోన్ బాలికల హైస్కూల్‌ల్లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. స్కూల్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభించాల్సి ఉంది. అయితే విద్యార్థినులు 12 గంటలకే వచ్చారు. స్కూల్ గేట్లు మధ్యాహ్నం 12.45 గంటల వరకు తెరవక పోవడంతో రోడ్డుపై ఎండలో నిలుచోవాల్సి వచ్చింది.
అసౌకర్యాల మధ్యనే పది పరీక్షలు


