శిరివెళ్ల: కేసీ కెనాల్ రైతులకు సాగు నీటి బెంగ పట్టింది. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో కేసీ కెనాల్, తెలుగు గంగ కాల్వల కింద 7,513 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. అయితే 11,258 హెక్టార్లలో పంట వేశారు. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు నీరు రాలేదు. మార్చి నెలలో అదే పరిస్థితి ఉండటంతో రైతులు అందరూ వెళ్లి అధికారులతో చర్చించారు. మార్చి చివరి వరకు పుల్కలంగా నీరు ఇవ్వలేవని అధికారులు చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. కేసీ కెనాల్‌లో 16వ లాక్ కింద వంతుల ప్రకారం ఈ నెల 9న నీటిని నిలిపి వేశారు. వంతుల ప్రకారం నీరిస్తే చివరి ఆయకట్టు అందదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీ 21,22 లాక్‌ల కింద ఉన్న వరి చేనులకు నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. పెట్టుబడికి భారీగా డబ్బు ఖర్చు చేశామని, నీరు రాకపోవడంతో పంట పండబోదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
వంతుల ప్రకారమే నీరు
కేసీ కెనాల్ కింద వేసిన పంటల రక్షణకు వంతుల ప్రకారం నీటిని ఇస్తాం. 16, 17 లాక్‌ల కింద పైరుకు నీటిని వదిలాం. వస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులను కోరుతున్నాం.
– ప్రతాప్, కేసీ కెనాల్ ఈఈ
కేసీ కెనాల్ రైతులకు కన్నీటి కష్టం
పొలం పారదు.. పంట పండదు!


