గోస్పాడు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) జిల్లాలో కొంత మంది గర్భిణులకే అందుతోంది. ఈ పథకానికి సంబంధించిన మొత్తం సొమ్ము (రూ.6వేలు) ఆయా గర్భిణులకు సకాలంలో అందడం లేదు. ప్రభుత్వం అందించే సొమ్ము ఎప్పుడొస్తుందో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకాన్ని 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన (ఐజీఎంఎస్ వై)గా ప్రారంభించింది. ఈ పథకాన్ని 2016లో ప్రధానమంత్రి మాతత్వ వందన యోజనగా ప్రధాని నరేంద్రమోదీ మార్పు చేశారు. ఈ పథకం మరింత మందికి లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో కొన్ని మార్పులు చేసిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చారు. పీఎంఎంవీవై ద్వారా అందించే నగదు.. గర్భిణులు, బాలింతల్లో మెరుగైన ఆరోగ్య కల్పనకు, నవజాత శిశు సంరక్షణకు, వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
రిజిస్ట్రేషన్ ఇలా..
జిల్లాలో 29 మండలాలు ఉండగా 52 పీహెచ్‌సీలు, 16 అర్బన్ హెల్త్‌సెంటర్లు, 11 సీహెచ్‌సీలు, రెండు ఏరియా, జిల్లా ఆసుపత్రి పరిధిలో మొత్తం 59,133 మంది గర్భిణులు రెండేళ్లలో నమోదయ్యారు. వారిలో 11,204 మంది గర్భిణులు పీఎంఎంవీవై కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 వరకు 3,666 మందికి మాత్రమే వారికి పీఎంఎంవీవై కింద నగదు అందినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి కాన్పులో ఆడ, మగ ఎవరో ఒకరు జన్మించినా, రెండో కాన్పులో కేవలం ఆడబిడ్డ మాత్రమే జన్మించిన వారు మాత్రమే పీఎంఎంవీవైకు అర్హులు. రెండు కాన్పులకు మించి ప్రసవాలు చేసుకునే వారికి అనర్హులు. గర్భం దాల్చిన మూడు నెలల్లోపు మాతృత్వ వందన పథకానికి వార్డు, గ్రామ సచివాలయంలోని వెల్‌నెస్ సెంటర్లో పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంది. అయితే గర్భిణుల నమోదు ప్రక్రియ ఒకలా ఉండటుండగా ఈ పథకానికి మాత్రం కొందరు మాత్రమే అర్హత సాధిస్తున్నారు.
విడతల వారీగా నగదు చెల్లింపు
● గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం పూర్తయ్యే లోపు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా విడతల వారీగా రూ.ఐదు వేలు చెల్లిస్తుంది.
● గర్భిణికి మూడు నెలలలోపు మొదట రూ. రెండు వేలు బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
● ఆరునెలల పాటు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ తీసుకున్న గర్భిణికి ప్రసవం అయిన 14వ వారం రూ. మూడు వేలు అందనుంది.
● రెండోకాన్పులో ఆడబిడ్డ పుట్టిన వారికి మాత్రం విడతల వారీగా కాకుండా ఒకేసారి రూ. ఆరు వేలు అందించనున్నారు.
ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం
ప్రతి నెలా గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నాం. నిర్ణీత సమయంలో గర్భిణుల వివరాల నమోదు చేసుకుని పథకం లబ్ధిని పొందేలా వైద్యసిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఆరోగ్య సిబ్బందికి, అంగన్‌వాడీలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసిన గర్భిణులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి.
– వెంకటరమణ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాదికారి
సంవత్సరం నమోదు అయిన రిజిస్ట్రేషన్ చేసిన నగదు జమైన
గర్భిణులు గర్భిణులు వారి సంఖ్య
2023-24 31,011 8,409 3,585
2024-25 28,122 2,795 81
జిల్లాలో 11,204 మంది
గర్భిణుల రిజిస్ట్రేషన్
3,666 మందికి మాత్రమే
పీఎంఎంవీవై నగదు జమ
కొందరికే ‘మాతృత్వ వందన’ం


