కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లె గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల బ్రహ్మయ్య, పార్వతి దంపతులు కుమారుడు విరాట్ యాదవ్ (13) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఇంటి వద్ద ఉన్న కుళాయికి నీళ్లు వస్తుండటంతో మోటర్ సాయంతో పట్టుకున్నారు. ఆ తర్వాత విరాట్ విద్యుత్ బోర్డులో నుంచి మోటర్‌కు చెందిన ప్లగ్ బయటకు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇంటి ముందున్న సీసీ రోడ్డుపై పడ్డాడు. ఈ క్రమంలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరికి చెందిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


