● రిమాండుకు ఆదేశించిన కోర్టు
బండిఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్త నంద్యాల సుధాకర్‌రెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిందితులను చూపించారు. ఈ సందర్భంగా నంద్యాల ఏఎస్పీ మంద జావళి మాట్లాడుతూ.. లింగాపురం గ్రామంలో కొన్నేళ్ల నుంచి నంద్యాల సుధాకర్‌రెడ్డికి, అదే గ్రామానికి చెందిన మాల గుర్రాల రామస్వామికి స్థలం విషయంలో గొడవ ఉండేదన్నారు. స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రామస్వామి అతని కుమారులు.. నంద్యాల సుధాకర్‌రెడ్డిని కిరాతంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులతో తేలిందన్నారు. నిందితులైన గుర్రాల రామస్వామి, అతని కుమారులు గుర్రాల శివన్న, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మన్నలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండుకు ఆదేశించినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ జగన్‌మోహన్, మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డితో పోలీస్ సిబ్బందిని అభినందించారు.
ప్రజలకు సదుపాయాలు కల్పించరా?
కర్నూలు (టౌన్): చిన్నపాటి సమస్యలపై నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పన్నులు చెల్లించే ప్రజలకు సదుపాయాలు కల్పించరా? అని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు పుల్లారెడ్డి ప్రశ్నించారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో వివిధ కాలనీలకు చెందిన ప్రజలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ కాలనీ, రిచ్మండ్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో సదుపాయాలు కల్పించాలన్నారు. టెలికాం నగర్, బాలాజీనగర్ పార్కు, సుందరయ్య పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. ఖాళీ స్థలాలను సంరక్షించి అభివృద్ధి చేయాలని, శివారు కాలనీలలో 100 మినీ వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటి చెత్త సేకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ బీవై రామయ్యకు, కమిషనర్ రవీంద్రబాబుకు వినతిపత్రాలు అందజేశారు.
హత్య కేసులో నిందితుల అరెస్ట్


