● ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ప్యాపిలి: తన కలలు నెరవేరడం లేదనే బెంగతో ఓ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్యాపిలి మండలం ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన సుధాకర్, సుధారాణి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మరమేసి అరుణ్ కుమార్ (23) పంజాబ్‌లోని రోపర్ యూనివర్సిటీలో ఐఐటీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్షల్లో ఒక్క సబ్జెక్టు బ్యాక్‌లాగ్‌లో ఉండటంతో ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపిక కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ్ కుమార్ తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తన ముఖం ఎలా చూపించాలని తరచూ స్నేహితులతో చెప్పి బాధపడేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 15న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. గమనించిన తోటి మిత్రులు పంజాబ్‌లో ఓ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆరుణ్ కుమార్ శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చెట్టంత కొడుకు విగతజీవిగా మారడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


