స్కూటీపై దేశ పర్యటన
మహానంది: ఆయన వయసు 77 ఏళ్లు. ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన వృద్ధుడు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటూ కాలక్షేపం చేయాల్సిన ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న గౌరవం ఇంటి దగ్గరకే పరిమితం కాలేదు. ఏ మాత్రం అలుపు లేకుండా సనాతన ధర్మం గొప్పదనాన్ని వివరిస్తూ స్కూటీపై దేశ వ్యాప్త పర్యటిస్తూ శుక్రవారం మహానంది చేరుకున్నారు. విజయనగరానికి చెందిన సంస్కృత ఉపాధ్యాయుడు నారాయణమ్ వెంకటరెడ్డి గత ఏడాది అక్టోబర్ నెల 13వ తేదీన మణికొండలోని గోల్డన్ టెంపుల్ నుంచి తన యాత్రను ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్టాటక రాష్ట్రాలు పర్యటించారు. సనాతన ధర్మం కోసం ప్రచారం చేస్తూ పాఠశాలల్లో సంస్కృత భాష ప్రాధాన్యత వివరిస్తూ భగవద్గీత బోధిస్తున్నారు. 800 రోజుల్లో లక్ష కిలోమీటర్ల లక్ష్యంగా దేశ పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు 8వేల కిలోమీటర్లు తిరిగానని, మిగిలిన 92 వేల కిలోమీటర్లు పర్యటిస్తానని చెప్పారు. మహానందికి వచ్చిన ఆయనకు ఆలయ ప్రధానార్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ స్వాగతం పలికి పూజలు నిర్వహింప చేశారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారెడ్డి, స్థానిక ఏజేన్సీ ఉద్యోగులు ఆయనకు స్వామి వారి ప్రసాదాలు అందించారు.


