దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ విశేష కృషి
నంద్యాల(అర్బన్): దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ విశేష కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమైనవని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్సీతోపాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, మునిసిపల్ చైర్‌ర్సన్ మాబున్నిసా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, దళిత సంఘాల నాయకులు శనివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విక్టోరియా రీడింగ్ రూమ్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్‌కు భారతరత్న అవార్డు ఇచ్చేందుకు అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిపై ప్రతి పౌరునికి బాధ్యత ఉండాలన్నది జగ్జీవన్ రామ్ తపన అన్నారు. ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ వంటి మహోన్నత వ్యక్తుల జయంతులను జరుపుకుంటున్నామని, వారి స్ఫూర్తిదాయమైన ఆశయాలను ఆచరణలో ఉంచి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్నారు. దళిత సంఘల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాస్, బాలస్వామి, లింగన్న, చిన్న వెంకటస్వామి, ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


