మాజీ సీఎం జగన్ పర్యటనపై ‘డ్రోన్’ నిఘా
ప్యాపిలి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాతో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు ఉమ్మడి కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పోతుదొడ్డి వద్దకు చేరుకున్నారు. జగన్ పర్యటనకు జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తారనే అనుమానంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం. డ్రోన్ కెమెరా ద్వారా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఎస్పీ ప్యాపిలి, డోన్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలపై స్థానిక అధికారులతో ఆరా తీశారు.
13న గురుకులాల
ప్రవేశ పరీక్ష
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో(2025–26) 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 13న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల సమన్వయకర్త డాక్టర్ ఐ.శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలోని 8, నంద్యాల జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతిలో 1,120 సీట్లకు 9,340 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 1,480 సీట్లకు 7,727 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. డోన్‌లోని బాలుర పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసుకున్న విద్యార్థులు సమీపంలోని బాలికల పాఠశాలలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు http://apqpcet. apcfss.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి టోకరా
బొమ్మలసత్రం: అసలు నోటుకు నాలుగింతలు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన ఆంజనేయులు, శివప్రసాద్, వెంకటశివ నాగప్రసాద్‌లు తమ వద్ద రూ.5 లక్షలు నకిలీ నోట్లు ఉన్నాయని తమకు కేవలం రూ.50 వేలు ఇస్తే చాలని పట్టణంలో పలువురుని ఆశ్రయించారు. ఈ క్రమంలో నందమూరినగర్‌కు చెంది న సత్యరాజు వారి బుట్టలో పడ్డాడు. ఈ మేరకు ఆదివారం రూ. 50 వేలు తీసుకుని స్థానిక అయ్యలూరిమెట్ట సమీపంలో ఓ చోటుకు చేరుకున్నాడు. కాగా నకిలీ నోట్లు ఇవ్వకుండా సత్యరాజుపై దాడి చేసి రూ. 50 వేలతో నిందితులు పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


