రైతుల కష్టం బూడిదపాలు
దొర్నిపాడు: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన మిరప పంట దగ్ధమైంది. మొత్తంగా రూ. 6 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. దొర్నిపాడు మండలం డబ్యూ. గోవిందిన్నె గ్రామానికి చెందిన మద్దుబాయిగారి నసీమ, వెంకటేశ్వర్లు 3.56 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇటీవలే పంటను కోసి గ్రామ శివారులోని ఓ పొలంలో ఆరబోశారు. నిప్పు రవ్వలు వచ్చి మిర్చిపై పడటంతో కాలిపోయింది. ఈ ఘటనపై వ్యవసాయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పరిశీలించారు. పంట నష్ట పరిహారం అందించి, తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న (ఏఎల్‌ఎస్‌సీఓ) సెక్టోరల్–01 పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ ప్రేమాంతకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో పని చేస్తున్న పాఠశాల సహాయకులు అర్హులని తెలిపారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలు deonandyal.blogspot.comలో పొందాలని సూచించారు.
ఎస్సార్బీసీకి
నీటి విడుదల బంద్
బనగానపల్లె: ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు నీటి సరఫరా నిలిచిపోయింది. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గత రెండు రోజులుగా నీటి విడుదల నిలిపివేశారు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ పరిధిలో పాణ్యం, గడివేముల, నంద్యాల మండలాల్లో 1.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలు 70 వేల ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం వరి పంట పాలదశ గింజదశలో ఉన్నందున ఈ నెల చివరి వరకు నీటిని విడుదల చేయలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న, మిరప పంటలకు రెండు తడుల నీరు అందాల్సి ఉంది.
21న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 20 మోడల్(ఆదర్శ) పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునేందుకు ఈ నెల 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రటకనలో తెలిపారు. గతంలో 20వ తేదీన ప్రవేశ పరీక్ష ప్రకటించడంతో ఈస్టర్ పండుగ సందర్భంగా 21వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.csc.ap.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
రైతుల కష్టం బూడిదపాలు


