విద్యార్థి.. తీరని దాహార్తి
● పాఠశాలల్లో అందని మంచినీరు
● పనిచేయని మినరల్ వాటర్ ప్లాంట్లు
● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
గోస్పాడు: ప్రభుత్వ పాశాలల్లో విద్యార్థులకు సకాలంలో మంచినీరు అందడం లేదు. దీంతో చిన్నారులు తాము తెచ్చుకున్న బాటిళ్లలోని నీటిని తాగుతున్నారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గొంతులు ఎండి విద్యార్థులకు ఎక్కిళ్లు వస్తున్నా.. చుక్క నీరు ఇచ్చేవారు కరువయ్యారు.
గతంలో ఇలా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘మన బడి–నాడు నేడు’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించింది. విద్యార్థులు సురక్షిత మంచినీరు తాగేలా నీటిశుద్ధి యంత్రాలను సరఫరా చేసింది. అలాగే వేసవి కాలంలో పాఠశాలల్లో నీటి గంట కొట్టి మధ్యాహ్నం లోపు విద్యార్థులు మూడుసార్లు మంచినీరు తాగేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు నిర్దేశించింది. విద్యార్థులందరికీ సురక్షిత నీరు అందుబాటులో ఉంచాలని, వాటర్ ప్లాంట్లు పనిచేయకపోతే తక్షణం మరమ్మతులు చేయించాలని ఆదేశించింది. అప్పట్లో విద్యార్థులు సురక్షిత మంచినీరు తాగి దాహార్తికి దూరంగా ఉండేవారు. ఆరోగ్యంగా విద్యాభ్యాసం చేసేవారు.
ప్రస్తుత దుస్థితి ఇదీ..
గోస్పాడు మండలంలో 14 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా..ప్రస్తుతం 5 చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి. విద్యాశాఖ పాఠశాలల్లో వాటర్ బెల్స్‌ను అమలు చేస్తోంది. అయితే పాఠశాలల్లో మంచినీరు లేక అందుబాటులో ఉన్న నీటినే విద్యార్థులు తాగాల్సి వస్తోంది. వేసవి ఎండల తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు సార్లు వాటర్ బెల్ (నీటి గంట) కొట్టాలని ఆదేశాలు వచ్చాయి. అయితే అందుబాటులో ఉన్న నీటినే విద్యార్థులు తాగాల్సి వస్తోంది.
ఉన్నతాధికారులకు
తెలిపాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు సార్లు వాటర్ బెల్ విధానం పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఉదయం 10, 11, 12 గంటలకు తప్పనిసరిగా వాటర్ బెల్స్ కొట్టి విద్యార్థులందరూ మంచినీరు తాగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ ప్లాంట్లు పనిచేయకపోతే తక్షణం మరమ్మతులు చేయించాలని ఆదేశించాం. పని చేయని వాటర్ ప్లాంట్లపై ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు తెలిపాం. –అబ్దుల్‌కరీం, ఎంఈఓ, గోస్పాడు
విద్యార్థి.. తీరని దాహార్తి


