పారదర్శకంగా బదిలీలు చేస్తాం
బొమ్మలసత్రం: వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులు బదిలీల కోసం వినతిపత్రాలు ఇచ్చారని, వారిని పారదర్శకంగా స్థానచలనం చేస్తామని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను, అలాగే మ్యూచువల్, రిక్వెస్ట్ బదిలీలను, పదోన్నతులను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఎస్‌బీ సీఐలు మోహన్‌రెడ్డి, సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీతో వేరుశనగ
విత్తన కాయలు
కర్నూలు(అగ్రికల్చర్): వేసవిలో నీటి సదుపాయం కింద వేరుశనగ సాగుకు 50 శాతం సబ్సిడీతో విత్తనం వేరుశనగ కాయలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 2000 హెక్టార్లకు విత్తనాలు పంపిణీ చేస్తారని వ్యవసాయ అధికారులు తెలిపారు. కే–6, టీసీజీఎస్ 1694 రకం వేరుశనగ కిలో పూర్తి ధర రూ.96 ఉండగా సబ్సిడీ రూ.48 ఉంటుంది. కదిరి లేపాక్షి రకం కిలో ధర రూ.85 ఉండగా సబ్సిడీ రూ.42.50 ఉంటుంది. ఇవి 30 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయి. గరిష్టంగా రెండు హెక్టార్లకు 10 ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. వేసవిలో వేరుశనగ సాగు చేసే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
నేడు కూడా రిజిస్ట్రేషన్లు
కర్నూలు(సెంట్రల్): రెండో శనివారం సెలవు అయినా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ పీజీ కల్యాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అన్ని పనిచేస్తాయని, అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ట్రెజరీల్లో హెల్ప్‌లైన్ నంబర్లు
కర్నూలు(సెంట్రల్): పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ట్రెజరీల్లో హెల్ప్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా ట్రెజరీకి సంబంధించి 6300968380, నంద్యాల జిల్లా ట్రెజరీకి 9849388295 నంబర్లను కేటాయించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో పెన్షన్ మంజూరు కోసం కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, రిటైర్డ్ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ‘సాక్షి’లో వచ్చిన కథనంపై లోకాయుక్త 2025 ఫిబ్రవరి 7న సుమోటోగా కేసు నమోదు చేసింది. అవినీతి, అక్రమాలను అరికట్టడం, కాలయాపన నిరోధానికి చర్యలు తీసుకోవా లని ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ డైరక్టర్‌కు నోటీసులు పంపింది. అందులో భాగంగా ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ డైరక్టర్ పలు పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీల్లో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉపలోకాయుక్తకు నివేదిక సమర్పించారు. ఈ నివేదక శుక్రవారం ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీకి అందడంతో కేసును మూసి వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. హెల్ప్‌లైన్ నంబర్లతో రిటైర్డ్ ఉద్యోగులు త్వరగా సేవలను పొందేందుకు వీలు ఉంటుందని ఆమె తెలిపారు.


