ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలివ్వాలి
నంద్యాల(న్యూటౌన్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు 12 వారాల పెండింగ్ వేతనాలను వెంటనే మంజూరు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివనాగరాణి, జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి నరసింహనాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి కూలీలందరికీ పనులు కల్పించాలని, పని చేసే ప్రదేశంలో మెడికల్ కిట్లు ఇవ్వాలన్నారు. మంచినీళ్లు ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకుల పెత్తనం పెరిగిపోయిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు స్వాములు, బాలయ్య, ఈశ్వరమ్మ, బాషా, మద్దిలేటి, వీరభద్రుడు, కరీం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


