మొక్కజొన్న రైతుల కష్టాలు కనిపించవా!
రుద్రవరం: వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న మొక్కజొన్న రైతుల కష్టాలు కూటమి ప్రభుత్వానికి కనిపించవా అని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డ–అహోబిలం రహదారిపై ముత్తలూరు మెట్ట వద్ద ఆరబోసిన మొక్కజొన్నలను ఆదివారం ఆయన పరిశీలించారు. పలువురు రైతులు తడిసి మొలకెత్తిన మొక్కజొన్నలను చూపించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో దిగుబడులు ఎకరాకు 15 క్వింటాళ్లకే పడిపోయిందన్నారు. అరకొర దిగుబడి కూడా తడిసి మొలకెత్తాయని వాటిని ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.1600కే కొనుగోలు చేస్తుండటంతో పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా రైతులకు అందే పరిస్థితి లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీమా చేయించడంతో పాటు పరిహారం అందించింది ఆదుకుందని గుర్తు చేశారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400ల ప్రకారం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను విస్మరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం నల్లవాగుపల్లె మెట్ట సమీపంలో గాలివానకు నేలవాలిన వరిపైరును పరిశీలించారు. ఆయన వెంట ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జెల రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ప్రసాదరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, బద్రినారాయణ, రామనాథరెడ్డి, పాణ్యం చంద్ర, నాగేష్, శూలం ప్రభాకర్, మాధవ, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి


