శ్రీగిరి కిటకిట
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీగిరికి తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మల్లన్న దర్శనానికి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు భక్తులు కార్తీకదీపారాధన చేసుకుని ప్రత్యేక నోములు నోచుకున్నారు. కార్తీక దీపారాధనకు దేవస్థానం విస్త్రత ఏర్పా ట్లు చేసింది. భక్తుల రద్దీతో ఆలయ పురవీధులన్నీ కిటకిటలాడాయి.
కుందూనదికి పోటెత్తిన వరద
కోవెలకుంట్ల: స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్‌తోపాటు ఎగువ ప్రాంతాల్లో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కుందూనదికి వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, పొలాల్లోని నీరంతా కుందూలోకి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో నదికి అనుసంధానంగా ఉన్న కప్పల పాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు పరీవాహకంలో ఉన్న వరి పైర్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పంట నీట మునిగింది.
వైఎస్సార్‌సీపీ ర్యాలీ వాయిదా
కల్లూరు: మొంథా తుపాన్ కారణంగా వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో ఈ నెల 28న ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నియోజకవర్గాల్లో తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసినట్లు వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్‌సీపీ నేతలు గమనించాలని ప్రకటనలో సూచించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం
నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగుల సమస్యల పరిష్కార ధ్యేయంగా పోరాడుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర పరిశీలకుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగులకు రావా ల్సిన బకాయిలపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఉద్యమాలే శరణ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, కోశాధికారి శ్రీనివాసులు, టైం స్కేల్ అధ్యక్షుడు సురేష్, సభ్యులు హనుమంతు, వేణుగోపాల్‌రెడ్డి, యశ్వంత్, విజయలక్ష్మి, చెంచమ్మ, లక్ష్మీదేవమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 27న సోమవారం ‘ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖా స్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్‌సైట్‌లో, టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీగిరి కిటకిట
శ్రీగిరి కిటకిట


