సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి అన్ని పార్టీల కంటే ముందుగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల క్రమంలో అసమ్మతి స్వరాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు దృష్టి సారించిన పార్టీ అధిష్టానం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. అసంతృప్త నేతలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరుపైన ప్రత్యేక నజర్ వేసింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించారు.
అయితే ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను మార్చాలంటూ అసమ్మతి నేతలు మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం బాలాజీసింగ్ తదితరులతో భేటీ అయ్యారు. తాజాగా శనివారం హైదరాబాద్‌లో అసమ్మతి నేతలు సుమారు 50 మందితో పాటు కల్వకుర్తి టికెట్‌ను ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో హరీశ్‌రావు, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వారి మధ్య వాడీవేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మాకు ప్రాధాన్యత లేదు.. ప్రజల్లో ఆయనపై నమ్మకం లేదు..
సుదీర్ఘ చర్చలో భాగంగా అసమ్మతి నేతలు పలు సమస్యలను పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తమను ఎమ్మెల్సీ కసిరెడ్డి వర్గం అంటూ ఎమ్మెలే జైపాల్‌యాదవ్ పూర్తిగా పక్కన పెట్టారని.. పార్టీ పదవులు, ప్రభుత్వ కార్యకలాపాల్లో దూరం పెట్టడంతో పాటు ప్రభుత్వ పథకాలను పేదలైనప్పటికీ తమ వార్డులు, గ్రామాలకు చెందిన ప్రజల దరిచేరకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించినట్లు పలు ఉదాహరణలను పెద్దల ముందు ఉంచారు.
ఇటు పార్టీలో, అటు ప్రజల్లో ఎమ్మెల్యేపై నమ్మకం లేదని.. అభ్యర్థిని మార్చి నియోజకవర్గంలో పార్టీని కాపాడాలని వేడుకున్నట్లు సమాచారం. సమన్వయం చేసుకునే తీరిక ఆయనకు లేదని.. కల్వకుర్తి నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క ప్రత్యేక ప్రయోజనం చేకూర్చిన దాఖలాలు లేవంటూనే.. సర్వేల్లో గెలుస్తారని తేలిన కసిరెడ్డికే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
రేవంత్ ఇలాకా అనే ప్రత్యేక నజర్ ?
బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. పలు జిల్లాల్లో అసమ్మతి నేతలు నిరసన ప్రదర్శనలకు దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయినా పార్టీ అధిష్టానం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే కల్వకుర్తిలో అసమ్మతి గళంపై బీఆర్‌ఎస్ పెద్దలు దృష్టి సారించడం.. ఏకంగా ముగ్గురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే అసమ్మతి నాయకులతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సొంత ఇలాకా కావడంతో పాలమూరుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక నజర్ వేశారని.. ఒక్క సీటు కూడా కోల్పోవద్దనే ఉద్దేశంతో ఆయన పకడ్బందీగా ముందుకు సాగుతున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment