గడ్డం వెంకటస్వామికి ఘన నివాళి
నారాయణపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎస్పీ ఎన్ లింగయ్య పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ నిరుపేదల పక్షపతిగా, రాజకీయాల కన్నా సమాజ శ్రేయస్సుకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ఉన్నత భావాలు కలిగిన మహా మనిషి కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి అని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరసింహ, పోలీసుల అధికారులు శంకర్ లాల్, శివశంకర్, రిజర్వ్ పోలీసులు పాల్గొన్నారు.
గద్దర్.. ఒక నిశబ్ద విప్లవం
మన్ననూర్: ప్రజా యుద్దనౌక గద్దర్ అంటే ఇక నిశబ్ద విప్లవమని.. పేద ప్రజల గొంతుక అని ప్రముఖ రచయిత ప్రొ. కంచె ఐలయ్య అన్నారు. మన్ననూర్‌లోని అంబేడ్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన 15 అడుగుల గద్దర్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ, విమలక్కలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. గద్దర్‌ను ఎక్కడో బొందపెడితే శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలో దేవుడై నిలిచాడని కొనియాడారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. తెచ్చింది మాత్రం గద్దర్ అని అన్నారు. కేసీఆర్ నిరహారదీక్ష చేస్తే తెలంగాణ రాలేదని.. గద్దర్ లాంటి ఉద్యమకారులు, విద్యార్థుల త్యాగాలతోనే స్వరాష్ట్రం ఏర్పడిందన్నారు. సినీ పరిశ్రమలో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులుగా రూపాంతరం చేయడంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గద్దర్ విగ్రహాలు ఏర్పాటు చేసి రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. వరంగల్ పట్టణంలో నిర్మించే కళా క్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆటపాటలు బతికున్నంత కాలం గద్దర్ ఈ భూమిపై బతికే ఉంటారన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో 25 వరకు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఈసందర్భంగా అన్నారు.
గడ్డం వెంకటస్వామికి ఘన నివాళి


