
కంది రైతుపై ఆంక్షల కత్తి
ఎకరానికి 3.31 క్వింటాళ్ల కొనుగోలుకే పరిమితం
●
ప్రైవేటులో విక్రయించా..
పండించిన మొత్తం కందిని ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాగుంటుంది. నా సొంత పొలం 10 ఎకరాల్లో కంది పంటను సాగు చేశా. 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. 40 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారు. మిగిలిన పంటను బహిరంగ మార్కెట్‌లో అమ్మితే రూ.50 వేల వరకు నష్టపోయాను. ఎకరాకు రూ.3.31 మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయాలి.
– మారుతి, రైతు, నాగిరెడ్డిపల్లి గ్రామం
అనుమతి రాలేదు
జిల్లాలో కంది అధిక దిగుబడి వచ్చిన రైతులు ప్రభుత్వం విధించిన ఎకరానికి 3.31 క్వింటాళ్ల నిబంధనతో ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీంతో పరిమితిని 6 క్వింటాళ్లకు పెంచాలనే అంశంపై ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా లేఖ రాశాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే కొనుగోలు చేస్తాం.
– ఇంద్రసేనా, మార్క్‌ఫెడ్ డీఎం
నర్వ: ఆరుగాలం కష్టించి పండించిన కందులను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. కంది పంట ఇంటికి చేరుతున్న తరుణంలో ధర తగ్గడంతో రైతుల నుంచి మద్దతు ధర కంది పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోళ్లలో నిబంధనలతో రైతులు పంటను విక్రయించుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో రైతు నుంచి ఎకరానికి 3.31 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా వ్యవసాయశాఖ నిర్వహించిన సమగ్ర సర్వేలో కందిపంట సాగు చేసినట్లు పేర్లు ఉన్న రైతులు నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ప్రభుత్వ ఆంక్షలతో కేంద్రాల్లో పంటను విక్రయించుకోలేక జిల్లా రైతులు కర్ణాటక మార్కెట్‌కు కందిని తీసుకెళ్తున్నారు.
2.65 లక్షల క్వింటాళ్ల దిగుబడి
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 70 వేల ఎకరాల్లో రైతులు కందిపంటను సాగుచేశారు. ఇందులో ఈ దిగుబడి అంచనా 2లక్షల 65 వేల క్వింటాళ్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వాతావరణం అనుకూలించక దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీనికి తోడు పంట విక్రయించడానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం తేమ 12 శాతం లోపు ఉంటే క్వింటాల్‌కు రూ.7550ల మద్దతు ధర చెల్లిస్తుంది. దీంతో గత నెలలో ఆయా కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించినప్పటికి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామనే భరోసా రైతులకు అధికారుల నుంచి లభించక ఆందోళన చెందుతున్నారు. కేంద్రానికి కందులు తీసుకెళ్లాలా..? వద్దా అనే సందేహంతో జిల్లాల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
నిబంధన ఎత్తేయాలని ఎమ్మెల్యేకు మొర
గత నెలలో నర్వలో కంది కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో రైతులు ఎకరానికి 3.31 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేయాలని మొరపెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించి 6 క్వింటాళ్లకు పెంచేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
తగ్గిన పరిమితి
కంది పంట చేతికి రాగానే క్వింటాల్ రూ.10 వేలు ఉన్న ధర రూ.7వేలకు పడిపోయింది. మద్దతు ధర కంటే మార్కెట్లో ధర తగ్గిపోవడంతో మద్దతు ధరతో కంది కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గతంలో ఎకరానికి ఆరు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది మరింత తగ్గించింది. రైతులకు వచ్చే పంట దిగుబడితో సంబంధం లేకుండా ఎకరానికి 3.31 క్వింటాళ్లు ఒక్కో రైతు నుంచి 40 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించింది. అంతర పంటగా సాగు చేసే రైతులకు నాలుగు క్వింటాళ్లు, పూర్తిగా కంది పంట సాగు చేసే రైతులకు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. చేసేదేమి లేక రైతులు కర్ణాటకకు పంటను తీసుకెళ్తున్నారు. అక్కడ పంటను విక్రయించుకుంటే డబ్బులు త్వరగా వస్తాయని వెళ్తున్నట్లుగా తెలిసింది.
ఆంక్షలతో ప్రైవేటులో విక్రయించి నష్టపోతున్న రైతులు
మరికొందరు కర్ణాటకు తరలిస్తున్న వైనం
జిల్లాలో 70 వేల ఎకరాల్లో కంది సాగు.. 6 కొనుగోలు కేంద్రాలు
దిగుబడి అంచనా 2.65 లక్షల క్వింటాళ్లు

కంది రైతుపై ఆంక్షల కత్తి
Comments
Please login to add a commentAdd a comment